సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకాలను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగో దశ అన్‌లాక్ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించడంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని కార్యకలాపాల విషయంలో ఆంక్షలు కొనసాగుతాయని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు వంటి ప్రాంతాల్లో మూసివేత కొనసాగుతుంది. ఆన్‌లైన్, డిస్టెన్స్ విధానంలో బోధనకు అనుమతి కొనసాగించవచ్చు. అయితే సెప్టెంబర్ 21 నుంచి కంటైన్‌మెంట్ జోన్ల బయట కనీసం 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావచ్చు.
ఆ తరగతుల విద్యార్థులు వెళ్లొచ్చు
కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల 9 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు తాము చదివే స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయుల వద్ద తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే దీనికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లిఖితపూర్వకంగా తమ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐటీఐలతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలకు అనుమతి ఇస్తారు. పీహెచ్‌డీ, పీజీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు ప్రయోగశాలలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
వంద మందితో కార్యక్రమాలు
సామాజిక, విద్యా, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ పరమైన కార్యక్రమాలను వంద మందికి మించకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ సెప్టెంబర్ 21 నుంచి నిర్వహించుకోవచ్చు. అయితే మాస్క్‌లు, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ తదితర నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అయితే వివాహానికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది పరిమితి మాత్రం సెప్టెంబర్ 20 వరకు కొనసాగుతుంది. 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: 7 నుంచి మెట్రో రైళ్లు
Published Wed, Sep 2 2020 1:31 AM | Last Updated on Wed, Sep 2 2020 12:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment