ఒంటరి మహిళలే లక్ష్యం | One Men Arrested By JubileeHills Police | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే లక్ష్యం

Mar 31 2026 4:30 AM | Updated on Mar 31 2026 4:30 AM

One Men Arrested By JubileeHills Police

ఇద్దరి హత్య

బెట్టింగ్‌లకు బానిసై దురాగతాలు

నిందితుడు కృష్ణాజిల్లా వాసి  

బంజారాహిల్స్‌: బెట్టింగ్‌లకు బానిసై ఒంటరి మహిళలను మాయమాటలతో తన కారులో ఎక్కించుకుని దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించిన యువకుడిని జూబ్లీ హిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి  ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై  తీవ్రంగా నష్టపోతున్న అతను ఈజీ మనీ కోసం పథకం వేశాడు.  ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకుని గత ఐదు వారాల నుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించసాగాడు. 

ఓఆర్‌ఆర్‌ సర్విస్‌ రోడ్డుకు తీసుకెళ్లి.. 
ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని వాసు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న  ఆమెకు మాయమాటలు చెప్పి తనకారులో ఎక్కించుకున్నాడు. మధ్యాహ్నం నేరుగా నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని ఓఆర్‌ఆర్‌ సర్విసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి నెట్టేసి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  

డిక్కీలో బ్యాగ్‌ మరిచిపోయానంటూ.. 
ఆ తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్‌లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మంగతాయారమ్మ (60)ని వాసు టార్గెట్‌ చేశాడు. ఈనెల 17న ఆమె పని ముగించుకుని మధ్యాహ్నం బయటకు రాగానే జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–46లోని మస్తాన్‌నగర్‌లో దింపుతానని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. పట్టపగలు కారు కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్‌ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. అలాగే వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి మోకిళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పడే సి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. 

మిస్సింగ్‌ కేసులు నమోదు 
అటు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో యాదమ్మ మిస్సింగ్‌ కేసు, ఇటు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగతాయరమ్మ మిస్సింగ్‌ కేసులను పోలీసులు నమోదు చేశారు. యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్‌ కేసులను సీసీటీఎన్‌ఎస్‌లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్‌లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది.

దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బెట్టింగ్‌ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు సీరియల్‌ సైకో కిల్లర్‌ వాసును అరెస్టు చేశారు. మంగతాయారమ్మ ఒంటిపై ఉన్న నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా బెట్టింగ్‌ల్లో పెట్టాడు. ఒకవేళ నిందితుడు పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.  

Advertisement
 
Advertisement
Advertisement