
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పట్టభద్ర ఓటరును చేరుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పక్కా వ్యూహం, ప్రణాళికతో ముందుకు కదలాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సూచించారు. శాసన మండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి–మహ బూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానం ఎన్నికకు సంబం ధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఉదయం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో, సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని పార్టీ నేతలకు పరిచయం చేసిన తర్వాత పట్టభద్రుల ఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, ప్రణాళిక, ప్రచార షెడ్యూల్‌కు సంబంధించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 43 అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో ఈ నెల 27న టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ‘పట్టభద్రుల కోటా ఎన్నిక లేని మెదక్, కరీం నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తాం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ ఇన్‌చా ర్జీలుంటారు. అందరూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలి’ అని కేటీఆర్ ఆదేశించారు.
మండల స్థాయిలో పట్టభద్రులతో భేటీలు...
‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ పట్ట భద్రుల నియోజకవర్గం పరిధిలో సుమారు 5.17 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో సుమారు 3 లక్షల మందిని టీఆర్‌ఎస్ పక్షాన ఓటర్లుగా నమోదు చేశాం. ఈ నెల 27 తర్వాత పార్టీ ఇన్‌చార్జీల పర్యవేక్షణలో మండల స్థాయిలో పట్టభద్ర ఓటర్లతో ప్రచార సభలు నిర్వహించాలి’అని కేటీఆర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటరు జాబితాను విభజించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు అప్పగించారు. ఈ జాబితా ఆధారంగా ప్రతీ 50 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీని నియమించి పోలింగ్ శాతం పెరిగేలా చూడా లని, ఓటు నమోదు చేయాల్సిన తీరు, పార్టీ అభ్యర్థి కి ప్రథమ ప్రాధాన్యత ఓటు లభించేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. వివిధ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీవీ చర్చల్లో పాల్గొనేందుకు పార్టీ నేతలకు అనుమతి ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అయితే వివిధ అంశాలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి, విపక్షాల వాదనను శాస్త్రీయ ఆధారాలతో తిప్పికొట్టాలని సూచించారు.
ప్రచార అంశాలపైనా దిశానిర్దేశం...
మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో ప్రచారంలో ఓటర్లకు వివరిం చాల్సిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 1.32 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను పార్టీ నేతలకు అంద జేశారు. ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్ర ఓటర్లతో నిర్వహించే సమావేశాల్లో వివరించా లన్నారు. ప్రధాని మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావించాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారంలో ఎండగ ట్టాలని సూచించారు. విభజన హామీలు, జీఎస్టీలో కోత, మెడికల్ కాలేజీల మంజూరులో వివక్ష వంటి అంశాలను ప్రచారంలో లేవనెత్తాలన్నారు. పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నందున విపక్షాలకు ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించి.. గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చిన మేమెంత లొల్లి పెట్టాలే
‘పదేండ్లలో సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు ఇవ్వనోడు కూడా మా మీద మాట్లాడితే... ఆరేండ్లలో లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చిన మేమెంత లొల్లి పెట్టాలే. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వమైనా గడిచిన ఆరున్నరేండ్లలో ఎన్నో పనులు చేశాం. విభజన చిక్కులు ఇంకా వీడలేదు. జోనల్ సమస్య వంటి ఇతరత్రా సమస్యలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. ఎంతో చేసినా.. ఏమీ చేయలేదని ప్రచారం చేయడం సరికాదు’అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు.
‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని రీతిలో ఉద్యోగులకు 43 శాతం పీఆర్‌సీ ఇచ్చాం. రెండో పీఆర్‌సీ కూడా తప్పకుండా ఇస్తాం. దానికో కమిటీ ఉంది దాని పని అది చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు మాతో కలసి పనిచేశారు. వారి పట్ల మొసలికన్నీరు కారుస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కంటే ఉద్యోగులు మాకు అత్యంత సన్నిహితులు. వారి మీద టెంపరరీ ప్రేమ చూపెట్టడం మా వల్ల కాదు. ఉద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వారితో పాటు నాకు కూడా ఉంది. పీఆర్‌సీ సమయానికి రాలేదనే బాధ కొందరిలో ఉండొచ్చు. ఉద్యోగుల సమస్యలపై మాకు స్పష్టత ఉంది. ఇతర పార్టీలు అయోమయంలో ఉన్నాయి’అని కేటీఆర్ అన్నారు.
‘గ్రేటర్’లో ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు
‘గెలుపు పాఠం నేర్పుతుంది. ఓటమి గుణపాఠం నేర్పుతుంది. కొన్నిసార్లు కొందరికి ఉద్వేగాలు కలిసి వస్తాయి. సర్జికల్ స్రైక్ అంటూ కొందరు హడావుడి చేసినా గ్రేటర్‌లో మాదే నంబర్ వన్ పార్టీ. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మేమే గెలుచుకున్నాం. దుబ్బాకలో 500 ఓట్లు, గ్రేటర్‌లో కొన్ని సీట్లు పెరిగినందుకే ఊగిపోతున్నారు. అలా అయితే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన మేము శిగమూగాలా’అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవిని నేరుగా రాజ్యసభ లేదా మండలికి నామినేట్ చేయొచ్చు కదా అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ‘వాణీదేవిది ప్రత్యర్థులు కూడా గౌరవించే వ్యక్తిత్వం. పట్టభద్రుల ఆమోదంతో కౌన్సిల్‌లో అడుగు పెడతారు’అని సమాధానం ఇచ్చారు. దివంగత పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవి పట్టభద్రుల ఓట్లు పొందేందుకు అన్ని విధాలా అర్హులని, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఎన్నడూ సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు.
ఆరున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే... కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏపీలో పదేళ్లలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి సుమారు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. ఏటా వేయి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. ఐటీఐఆర్ రద్దుతో పాటు ట్రైబల్ యూనివర్సిటీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి విభజన సమస్యలను కేంద్రం విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. జీడీపీ పెంచుతామని ప్రకటించిన ప్రధాని మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment