సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు.
కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.
దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.
ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి.
Comments
Please login to add a commentAdd a comment