
సూర్యాపేట: పలానా గ్రూపు రక్తం వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందట.. పలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట అని చాలాసార్లే విని ఉంటాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది.
కరోనా వైరస్ మొదటి, సెకండ్ వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ చికిత్సపొందిన 200 మంది రోగుల రక్తనమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది. సేకరించిన రక్తనమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావూరి స్వరూప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment