భో‘జనం’ వృథా తగ్గించారు! | People Decreased The Wastage Of Food Due To Coronavirus | Sakshi
Sakshi News home page

భో‘జనం’ వృథా తగ్గించారు!

Published Sat, Sep 5 2020 3:44 AM | Last Updated on Sat, Sep 5 2020 3:44 AM

People Decreased The Wastage Of Food Due To Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతి పెరుగుతున్న కొద్దీ ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. దీంతో ఆహార వృథా కూడా తగ్గుతోంది. బయట అడుగు పెట్టేందుకు జంకడం, ఇంటి భోజనానికే పరిమితం కావడం.. ఆర్థిక పరిస్థితులు తలకిందులవ్వడంతో ఆచితూచి ఖర్చు చేస్తుండటం.. విందులు, వినోదాలు తగ్గించి, ఆరోగ్య సంరక్షణకై పోషక ఆహారానికి ప్రాధాన్యం పెరగడం.. తదితరాలు ఆహార వృథా తగ్గడానికి కారణాలు. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే 40 నుంచి 18 శాతానికి ఆహార వృ«థా తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. 

ఎన్నిమార్పులు తెచ్చిందో.. 
అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్‌ వంటి రోగాలు వస్తాయని, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యుల సూచనల మేరకు ప్రజలు బయటి ఆహారాన్ని పూర్తిగా తగ్గించారు. తృణధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, బ్రౌన్‌రైస్‌ వంటి ఆహారపు అలవాట్లు పెంచుకున్నారు. నూనె వంటకాలను తగ్గించారు. సాధారణంగా గృహాల్లో 23 శాతం ఆహారం వృథా ఉంటే అది ఇప్పుడు 15 శాతానికి తగ్గింది. ముఖ్యంగా గ్రామాల కంటే పట్టణాల్లో ఆహార వృథా ధోరణి ఎక్కువ. ఎక్కువ వంటకాలు, రాత్రి మిగిలిన వంటకాలను మరుసటి రోజు పారేయడం, బయటి ఆహారాన్ని తెచ్చుకోవడం వంటి అలవాట్లతో పట్టణాల్లో వృథా 50–55 శాతం ఉంటుంది. అది గ్రామాల్లో 30–35 శాతమే.

పట్టణాల్లోని ఎగువ, మధ్య తరగతి ప్రజల ఆర్థిక మూలాల్ని కోవిడ్‌ చిన్నాభిన్నం చేసింది. వ్యాపారాలు, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు, పెరుగుతున్న ధరల నేపథ్యంలో పట్టణ ప్రజల ఆదాయం సుమారు 40 శాతం మేర తగ్గింది. నెల చివరికొచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. దీనికి తోడు కూరగాయల ధరలు 30 నుంచి 35 శాతం, ఇతర నిత్యావసరాల ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో పొదుపు తగ్గింది. ఫలితంగా అవసరమైన మేరకు, తాజాగా ఉండే ఆహారాన్నే స్వయంగా వండుకునే అలవాట్లు పెరిగాయి. భిన్న రకాలైన వంటకాలు చేసినప్పుడు 67 శాతం ఆహారం వృథా అవుతుండగా, ప్రస్తుతం ఇది తగ్గింది. 

పెళ్లిళ్లు, పేరంటాలు లేకపోవడమూ కారణమే... 
అన్నింటికన్నా ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలు పూర్తిగా తగ్గాయి. వివాహాది కార్యాల్లో ఆహారపు వృథా 40–45 శాతం ఉంటుండగా, ప్రస్తుతం ఇలాంటి కార్యక్రమాలకు హాజరు తగ్గడం, ఎక్కువ రకాలైన వంటకాలకు ఫుల్‌స్టాప్‌ పడటం వంటి కారణాలతో ఈ వృథా 25 శాతానికి తగ్గినట్లు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో అతిథులు హాజరైన సమయంలో వృథా 74 శాతం వరకు ఉండేది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆహారపు వృథా సుమారుగా 40 శాతం వరకు ఉంటుంది.

అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లోనే 75 శాతానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చాలా రెస్టారెంట్లు తమ మెనూ తగ్గించాయి. డిమాండ్‌ ఉన్న కొద్ది వంటకాలనే అందుబాటులో ఉంచాయి. దీంతో వృథా చాలా మేరకు తగ్గింది. దేశవ్యాప్తంగా ఏటా 40 శాతం మేర వృథా ఉండగా, అది లాక్‌డౌన్‌ తర్వాత 18 శాతం మేర తగ్గిందని ఇటీవలి పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అవలంబిస్తున్న ఆహార ధోరణినే మున్ముందూ కొనసాగిస్తామని 80 వాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement