సాక్షి, హైదరాబాద్: ఒక్కో దేశంలోని మొత్తం కరోనా కేసుల కంటే ఎక్కువగా మన దేశంలో ఒక్క రోజులోనే నమోదవుతున్న నేపథ్యంలో జనంలో భయం తగ్గిపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ ప్రాంతానికి రావద్దంటూ ఇంతకాలం చేపట్టిన కరోనా నిరోధక చర్యలకు పూర్తిగా స్వస్తి పలికిన జనం క్రమంగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో మార్కెట్లు దాదాపు అన్నీ తెరుచుకుని పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఫలితంగా రవాణా అవసరం పెరిగి బస్సులు బిజీగా మారుతున్నాయి. ఇన్ని రోజులూ తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో పరుగులు పెట్టిన ఆర్టీసీ బస్సులు క్రమంగా కళకళలాడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు 20 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 50 శాతానికి చేరువవుతోంది. ప్రస్తుతం 43 నుంచి 46 శాతం మధ్య నమోదవుతోంది. దీంతో రోజువారీ టికెట్ ఆదాయం కూడా పెరిగింది. పది రోజుల క్రితం వరకు రోజువారీ ఆదాయం రూ.కోటి కంటే కాస్త ఎక్కువగా ఉండేది. ఇప్పుడది సగటున రూ.3.3 కోట్లుగా నమోదవుతోంది. దీంతో ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
స్వచ్ఛంద లాక్‌డౌన్‌లకు స్వస్తి పలకటంతో..
కొన్ని రోజుల క్రితం వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యేవి. తర్వాత నగర శివారుగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉండేవి. క్రమంగా ఈ ప్రాంతాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే సగానికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అదే సయమంలో ఇతర జిల్లాల్లో భారీగా పెరిగాయి. నెలరోజుల క్రితం వరకు రెండు, మూడు చొప్పున నమోదవుతూ ఉండే సిద్దిపేట లాంటి జిల్లాల్లో ఇప్పుడు నిత్యం వందకుపైగా రికార్డవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నిత్యం 250 వరకు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోని పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెటూళ్లలో కూడా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో పల్లె ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. ఇటీవలి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ఊళ్లు వందల్లో ఉండేవి. అక్కడ స్వచ్ఛంద లాక్‌డౌన్ ఆంక్షలు విధించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనం రాకుండా కట్టడి చేశారు. ఎవరైనా వస్తే వారు శివారులోని నిర్ధారిత ఇళ్లలో క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉండేది.
అప్పట్లో మార్కెట్లను మూసేశారు
కొన్ని పట్టణాల్లో కేసులు వెలుగుచూడటంతో 10–15 రోజులపాటు మార్కెట్లను మూసేశారు. కొన్ని రకాల దుకాణాలను మార్చి, మార్చి మూసేస్తూ వచ్చారు. దీంతో పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం జనానికి లేకుండా పోయింది. ఇక హైదరాబాద్‌ను దాదాపు చాలా గ్రామాలు నిషేధించినంత పనిచేశాయి. నగరానికి ఎవరైనా వెళ్తే తిరిగి గ్రామాల్లోకి ప్రవేశం ఉండదనే అనధికారిక హెచ్చరికలు అమల్లో ఉండేవి. దీంతో బస్సెక్కేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని ఊళ్లకు అసలు బస్సులనే రానీయలేదు. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. ఒక్కో బస్సులో ఐదారుగురికి మించని తరుణంలో డిపో మేనేజర్లు చాలా సర్వీసులను రద్దుచేసి 40 శాతం బస్సులనే తిప్పారు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసుల సంఖ్య పెరుగుదలకు క్రమంగా జనం అలవాటుపడిపోతున్నారు. ఫలితం గా వారిలో మునుపటి భయం తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు విధించకూడదంటూ అధికారులు కూడా హెచ్చరిస్తుండటంతో పరిస్థి తి మారింది. ఇప్పుడు అన్ని పట్టణాల్లో మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. జనం రాకపోకలు సాధారణ స్థితికి చేరుతున్నాయి. దీంతో ఇంతకాలం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా తిప్పటం ప్రారంభించారు. ఇప్పుడు 65% బస్సులు తిరుగుతున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతోంది. ఆక్యుపెన్సీ పెరుగుతుండటంతో సర్వీసులను అధికారులు క్రమంగా పునరుద్ధరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment