చట్టవిరుద్ధంగా సుజనా చౌదరికి రుణం.. ప్రజా ఆస్తుల దుర్వినియోగం
3 కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు.. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తి తాకట్టు
ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి బ్యాంకు అధికారులను ఏమార్చి ఉండవచ్చు
మోసపూరితంగా, నేరపూరితంగా లావాదేవీ జరిగింది
దీనిపై ఫిర్యాదు చేసి 11 నెలలైనా పోలీసులు విచారణ చేపట్టలేదు
సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు
ఈ అంశంలో సమన్లు జారీ చేసి లోతుగా విచారణ చేపట్టాలి
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైదరాబాద్ వాసి
పోలీసుల నుంచి వివరాలు తీసుకుని చెప్పాలని జీపీకి న్యాయమూర్తి ఆదేశం
తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘‘సుజనా ఇండస్ట్రీస్, వోల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టుపెట్టారు. అదికూడా రూ.24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి రూ.91 కోట్లు రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దురి్వనియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీపై విచారణ జరిపించాలి..’’ అని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు.
బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 193 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 90 రోజుల్లో చార్జిషిట్ దాఖలు చేయాలని.. కానీ 11 నెలలు అవుతున్నా దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనుక సుజానా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా, సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా సీసీఎస్ పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున ఎస్.ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీస్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ జీపీ (ప్రభుత్వ న్యాయవాది)ని ఆదేశిస్తూ, విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు.
చట్టవిరుద్ధంగా తనఖా పెట్టారు..
‘‘హైదరాబాద్ అమీర్‌పేట్ మండలం బహ్లూఖాన్‌గూడ సర్వే నంబర్ 129/3లోని 26,436.36 చదరపు గజాలు మాకు (హబీబ్ అల్లాద్దీన్‌కు) చెందిన భూమిని వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పీవీ రమణారెడ్డి 2013లో ఎక్స్‌పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని మేం 1963లో వోల్టాస్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చాం. లీజుకు ఇచి్చన వారిలో నేను భాగస్వామిని. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన వోల్టాస్ 26,436 చదరపు గజాల భూమిని వర్మ రియల్టర్స్‌కు కేటాయించింది.
సుజనాచౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీర్‌గా వ్యవహరించింది. లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసినా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ పశి్చమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో.. బకాయిలు రాబట్టడం కోసం రూ.400 కోట్ల విలువైన నా ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి.. వేలానికి పెట్టేలా ఉన్నారు’’ అని కోర్టుకు పిటిషనర్ వివరించారు.
కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా..
‘‘ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో.. లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా, తనఖా పెట్టకుండా ఆదేశాలివ్వాలని కోరగా.. మాకు అనుకూలంగా తీర్పు వచి్చంది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్ సంస్థ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్లను కొట్టివేశాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణ ఎగవేతదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్‌కు రుణం మంజూరైంది. వర్మ రియల్టర్స్‌కు చెందిన 96.64 శాతం షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరం. ఈ రెండు సంస్థల్లోనూ గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్‌కు వర్మ రియల్టర్స్ బినామీ లాంటి (ప్రాక్సీ) కంపెనీ అని తెలుస్తోంది’’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
సుజనా ఒత్తిడితోనే ప్రారంభంకాని విచారణ..
‘‘మా ఆస్తిని తనఖా పెట్టి సుజనా ఇండస్ట్రీస్ రుణం పొందేలా చేయడంలో వర్మ రియల్టర్స్‌కు అనుకూలంగా వోల్టాస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఎల్. కర్కరే వ్యవహరించారు. వర్మ రియల్టర్స్‌కు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ మొత్తం లావాదేవీ మోసపూరితంగా, నేరపూరితంగా జరిగింది. అసలు వర్మ రియల్టర్స్ ఆస్తిని లీజుకు మాత్రమే తీసుకుంది. దాని విలువ రూ.24 కోట్లే అయినా.. రూ.91 కోట్లను ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇచ్చిందో అర్థంకావడం లేదు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి బ్యాంకు అధికారులను ఏమార్చి ఉండవచ్చు. రుణ లావాదేవీ అనుమానాస్పదంగా, అస్పష్టంగా, అపారదర్శకంగా ఉంది. దీనిపై ఫిర్యాదు చేసినా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఏదో లెక్కకోసం మాత్రమే ఎఫ్‌ఐఆర్ చేసినట్లున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
సుజనా ఆస్తులను, వర్మ రియల్టర్స్ ఆస్తులను అటాచ్ చేయకుండా బ్యాంకు నా ఆస్తిని అటాచ్ చేయడం చట్టప్రకారం చెల్లదు. సుజనా చౌదరిపై, సుజనా ఇండస్ట్రీస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసినా.. ఇప్పటివరకు వారిని టచ్ కూడా చేయలేదు. అక్రమార్కులతో కుమ్మక్కైన రిజిస్ట్రేషన్ అధికారులు కూడా.. నేను ఆ భూమి ఈసీ సరి్టఫికెట్‌కోసం దరఖాస్తు చేస్తే మార్టిగేజ్ వివరాలు లేకుండా ఇచ్చారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించండి. ప్రతివాదులకు సమన్లు జారీ చేసి, విచారణ జరపాలి. చట్టవిరుద్ధంగా ప్రజా నిధుల నుంచి రూ.91 కోట్లు పొంది దురి్వనియోగం చేశారు. మా పిటిషన్‌ను అనుమతించండి’’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ న్యాయవాదిని ఆదేశించారు.
పిటిషన్‌లో పేర్కొన్న ప్రతివాదులు వీరే..
పిటిషన్‌లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీ, బషీర్‌బాగ్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ప్రతివాదులుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనాచౌదరి, ‘సుజన’ డైరెక్టర్లు గొట్టుముక్కల శ్రీనివాస్‌రాజు, నటరాజన్ సుబ్బరత్నం, కిరణ్ కుమార్ వీరమాచినేని, ఓల్టాస్ లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్లు బహ్రం నవ్రోజ్ వాకిల్, జుబిన్ సోలి దుబాష్, వినాయక్ కాశీనాథ్ దేశ్‌పాండే, ప్రదీప్‌కుమార్, దేబేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వర్మ’ డైరెక్టర్లు రమణారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి దేవిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కంచర్ల, శ్రీరామ్ కంబంపాటి, ఎక్స్‌పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment