TS: గవర్నర్‌ వైఖరి రాజ్యాంగ విరుద్ధం | Petition of Telangana Government in Supreme Court | Sakshi
Sakshi News home page

TS: గవర్నర్‌ వైఖరి రాజ్యాంగ విరుద్ధం

Published Fri, Mar 3 2023 3:03 AM | Last Updated on Fri, Mar 3 2023 7:50 AM

Petition of Telangana Government in Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి స్పందనా తెలపకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని.. ఈ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తెలపకుండా రాజ్‌భవన్‌లో ఆపేశారని.. దీనికి సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

గవర్నర్‌ తీరు వల్ల సదరు బిల్లులకు సంబంధించిన ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఈ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, పార్లమెంటులో జరిగిన చర్చలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించింది. ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖలను చేర్చింది. 

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లోని వివరాలివీ.. 
‘‘శాసనసభ ఆమోదించిన పలు బిల్లులపై తెలంగాణ గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదు. దీనివల్ల ఏర్పడిన రాజ్యాంగ ప్రతిష్టంభన దృష్ట్యా ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఉభయ సభలు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపినప్పుడు.. సమ్మతిస్తున్నట్టు లేదా ఆమోదం నిలిపివేస్తున్నట్టు చెప్పాలి. లేదా రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసినట్టు పేర్కొనాలి.

బిల్లు వచ్చినపుడు వీలైనంత త్వరగా తిప్పి పంపవచ్చు. ద్రవ్య బిల్లు కానట్లయితే నిర్దిష్ట నిబంధనలు/అంశాలను పునఃపరిశీలించాలని కోరవచ్చు. అప్పుడు దానిపై ఉభయ సభలు పునః పరిశీలన జరిపి తగిన సవరణలతో తిరిగి గవర్నర్‌కు పంపుతాయి. వాస్తవానికి ఆర్టికల్‌ 163 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సహాయం, సలహాతో మాత్రమే గవర్నర్‌ విధు­లు నిర్వహించాల్సి ఉంటుంది.

గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు లేదు. షంషేర్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మంత్రి మండలి సలహాలకు వ్యతిరేకంగా గవర్నర్లు రాష్ట్రంలో సమాంతర పరిపాలనకు ప్రయత్నించవచ్చని రాజ్యాంగ కర్తలు ఊహించలేదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.

పాత ఆర్టికల్‌ 175పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి చర్చిస్తూ.. ఆర్టికల్‌ 200 గవర్నర్‌కు ఎలాంటి స్వతంత్ర విచక్షణాధికారాన్ని అందించలేదని స్పష్టం చేశారు. ఏదైనా అధికారం, విధిని అమలు చేయడం కోసం రాష్ట్రపతి, గవర్నర్‌ సంతృప్తి చెందాలని రాజ్యాంగం కోరుతుందని షంషేర్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

కానీ ఆర్టికల్‌ 123, 213, 311(2), 317, 352(1), 356, 360ల ప్రకారం రాజ్యాంగం పేర్కొన్న ఈ సంతృప్తి.. రాష్ట్రపతి లేదా గవర్నర్‌ల వ్యక్తిగత సంతృప్తి కాదు. అది ప్రభుత్వంలోని మంత్రిమండలి వ్యవస్థ సంతృప్తి అనేది రాజ్యాంగం ఉద్దేశమని కూడా స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని పలు నిబంధనల ప్రకారం.. గవర్నర్‌ కొన్ని విధులు నిర్వర్తించడానికి అధికారమున్నా, ఆర్టికల్‌ 163 ప్రకారం మంత్రి మండలి సలహాలనే పాటించాల్సి ఉంటుంది..’’ అని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది. 

కారణమేదీ చెప్పకుండా ఆపడమేంటి? 
12–9–2022 తేదీ నుంచి 13–2–2023 తేదీ వరకూ పంపిన బిల్లులపై గవర్నర్‌ ఆమోదం, తిరస్కరణ ఏదీ చెప్పలేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. సహేతుకమైన కారణాలు చూపకుండా బిల్లులను పెండింగ్‌ పెట్టడం సరికాదని పేర్కొంది.

ఆయా బిల్లులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్లి తగిన వివరణలు ఇచ్చారని.. ఆ సమయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేసింది.

13–9–2022న పంపిన ఏడు బిల్లులను.. ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో పంపిన ఒక్కో బిల్లు కలిపి.. మొత్తం పది బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. వాటిపై గవర్నర్‌ ఏదో ఒక చర్య తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

పెండింగ్‌లో ఉన్న బిల్లులివీ.. 
► ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా (టెర్మినేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ లీజెస్‌) సవరణ బిల్లు, 2022 
► తెలంగాణ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు, 2022 
► తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌ యాన్యుషన్‌) సవరణ బిల్లు, 2022 
► యూనివర్సిటీ ఆఫ్‌ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు, 2022 
► తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, 2022 
► తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లు, 2022 
► తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్, రెగ్యులేషన్‌) సవరణ బిల్లు, 2022 
► ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు, 2023 
► తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, 2023 
► తెలంగాణ మున్సిపాలిటీస్‌ యాక్ట్‌ సవరణ బిల్లు, 2023   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement