
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు.
(చదవండి: పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదాలు!)
పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మరో 8 మందికి గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.
(చదవండి: మృత్యుసొరంగం)
ఆ స్వేచ్ఛ కూడా లేదా: ఎంపీ రేవంత్
ఇదిలా ఉంటే శ్రీశైలం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ఎంపీ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?’ అని ఆయన సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment