ఘటన తర్వాత మరో కేబుల్‌ను ఏర్పాటు చేస్తున్న జెన్‌కో అధికారులు, సిబ్బంది
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంతో రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరవక ముందే బుధవారం షార్ట్‌సర్క్యూట్‌తో మరోసారి మంటలు చెలరేగడం ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. అయితే అది మాక్‌డ్రిల్‌గా జెన్‌కో ఉన్నతాధికారులు ప్రకటించడంతో.. అది ప్రమాదమా.. మాక్ డ్రిల్లా అనే చర్చ మొదలైంది.
ఉద్యోగులు, సిబ్బంది పరుగులు
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం మొదటి యూనిట్‌లో నీటిని తోడిపోసి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోటారు, ఇతర సామగ్రిని విద్యుత్ కేంద్రంలోకి తీసుకొస్తున్న డీసీఎం వాహనం కేంద్రంలో తాత్కాలికంగా లైటింగ్ కోసం దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి కనెక్షన్ తీసుకున్న విద్యుత్ కేబుళ్లపై వెళ్లింది. అధిక లోడ్‌తో కూడిన డీసీఎం వాహనం విద్యుత్ కేబుళ్లపై వెళ్లడంతో వైర్లలో స్పార్క్ వచ్చి షార్ట్‌సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ప్రమాదం నుంచి తేరుకోని ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పొగ కమ్ముకోవడంతో అక్కడే ఉన్న అధికారులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేశారు. విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో నీటిని తోడి పోస్తున్న మూడు మోటార్లకు సంబంధించిన పైపులు కూడా కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో విద్యుత్ వైర్ కాలిపోవడంతో వెంటనే మరో కేబుల్ వేసుకొని అక్కడి విద్యుత్ లైట్లను పునరుద్ధరించుకొని పనులు చేపట్టినట్లు తెలిసింది. ఘటన బయటికి తెలియడంతో మళ్లీ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరిగింది.
అప్రమత్తతను గుర్తించేందుకే..
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన ప్రమాదంగా భావిస్తున్న తరుణంలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఈ సురేష్ రహస్య మాక్‌డ్రిల్‌గా ప్రకటించారు. పనులు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల అప్రమత్తతను గుర్తించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పునరుద్ధరణ పనులు చేపడుతున్న క్రమంలో అక్కడ కేవలం జెన్‌కో ఉద్యోగులే కాకుండా పారిశుద్ధ్య పనులు చేసేవారు, ఇతర కార్మికులు కూడా ఉన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తికాక ముందే మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు. ఒకవేళ మాక్‌డ్రిల్ నిర్వహిస్తే బయటి సబ్‌స్టేషన్ నుంచి లైటింగ్ కోసం కనెక్షన్ తీసుకున్నప్పుడు స్థానిక విద్యుత్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అప్రమత్తం చేయకుండా, అసలు విద్యుదుత్పత్తి ప్రారంభం కానప్పుడు మాక్‌డ్రిల్ ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాక్ డ్రిల్‌గా అధికారులు ప్రకటించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అది అనుకోకుండా జరిగిన ఘటనగానే చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment