Post Covid Condition: కోలుకున్నాక కూడా ఇలా చేయండి.. అప్పుడే! | Post Covid Condition: Doctors Says Follow These Tips To Full Recovery | Sakshi
Sakshi News home page

Post Covid Condition: కోలుకున్నాక కూడా ఇలా చేయండి.. అప్పుడే!

Published Thu, Jun 10 2021 2:32 PM | Last Updated on Thu, Jun 10 2021 2:53 PM

Post Covid Condition: Doctors Says Follow These Tips To Full Recovery - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్‌ నుంచి రికవరీ అయిన వెంటనే రోజువారీ విధులు, పనులకు ఉపక్రమించకుండా కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఏదైనా శారీరక శ్రమ, పనులు చేసే ముందు ఎవరికి వారు తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవాలి. 
ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని పదార్ధాలు, ఒకటి,రెండు రోజుల కిందటి ఆహారం అస్సలు తీసుకోవద్దు. ఐస్‌క్రీములు, కూల్, సాఫ్ట్‌డ్రింక్‌ల వంటివి పూర్తిగా మానేయాలి. 
వేడిగా ఉన్న ఆహార పదార్థాలు, వేడి పానీయాలు, ద్రవ పదార్థాలే తీసుకోవాలి. గంటకు ఒకసారి అయినా గ్లాసు చొప్పున గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది డీహైడ్రేషన్‌ జరగకుండా నివారిస్తుంది
రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జి అయిన లేదా ఇంట్లోనే ఉండి చికిత్స పొందిన రోగులు పూర్తిస్థాయిలో కోలుకునేందుకు.. వైరస్‌ తీవ్రత, రోగ నిరోధక శక్తితో పాటు కోవిడ్‌ అనంతర/సుదీర్ఘ కోవిడ్‌ (పోస్ట్‌ కోవిడ్‌/లాంగ్‌ కోవిడ్‌) సమస్యలను బట్టి, 2, 3 నెలల సమయం పట్టొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌లో ప్రధానంగా జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని అంటున్నారు. కరోనా నుంచి రికవరీ అయిన వెంటనే ఒకేసారి ఎక్కువగా శారీరక కార్యకలాపాలు నిర్వహించడం కానీ, రోజువారీ నిర్వహించే వివిధ పనుల్లో చురుకుగా పాల్గొనడం కానీ చేయొద్దని సూచిస్తున్నారు. ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల పరిస్థితి అప్పుడప్పుడే మెరుగుపడుతున్న క్రమంలో అధిక శారీరక శ్రమను, ఒత్తిడిని అవి తట్టుకోలేవని చెబుతున్నారు. శారీరక శ్రమ, వ్యాయామ సమయం దశల వారీగా పెంచాలని సూచిస్తున్న చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, జనరల్‌ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ ఎ.నవీన్‌రెడ్డితో ‘సాక్షి’ఇంటర్వ్యూ వివరాలు

వారి మాటల్లోనే... 
కోవిడ్‌ రోగులు కోలుకున్నాక కూడా బలహీనంగా ఉంటున్నారు. వారు పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతోంది. ఐసీయూలో చేరి కోలుకున్న పేషెంట్లు కోలుకోవడానికి 1–2 నెలలు పడుతోంది. అదే వెంటిలేటర్‌పై ఉండొస్తే 3–6 నెలల సమయం పట్టొచ్చు. ఈ దశలో శారీరక శ్రమ లేదా వ్యాయామం వంటివి ఒకేసారి ఎక్కువగా చేయకూడదు. అలాగని ఊరికే కూర్చోకుండా నార్మల్‌ ఫిజికల్‌ యాక్టివిటీని కొనసాగించాలి. నడక, తేలికపాటి వ్యాయామాలు క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. అలా చేస్తే నెల, రెండు నెలల్లోనే సాధారణ కార్యకలాపాలు చేసుకోగలుగుతారు.

ఈ సమయంలోనే అవయవాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు గట్టిగా గాలి పీల్చి వదిలేలా కొంతకాలం ‘ఇన్సెంటివ్‌ స్పైరోమీటర్‌’తో ప్రాక్టీస్‌ చేయాలి. రోజుకు 4 గంటలు బోర్లా పడుకుని గాలి పీల్చడం వంటివి చేయడం (సెల్ఫ్‌ ప్రోనింగ్‌) వల్ల మూసుకుపోయిన అల్వోలియస్‌ (వాయుకోశాలు) తెరుచుకుంటాయి. ఆక్సిజన్‌ లెవెల్స్‌ను 98కు పెంచేందుకు కొందరు ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్స్‌ వంటివి వాడుతున్నారు. ఇలా ఆక్సిజన్‌ డిపెండెన్సీ పెరగడం మంచిది కాదు. అది మానుకోవాలి.

కరోనా నుంచి రికవరీ అయ్యాక గదిలో ఉన్న గాలిలో 88 నుంచి 90 వరకున్నా సరిపోతుంది. నెమ్మదిగా మూడునెలల్లో పూర్వపు స్థితికి చేరుకుంటారు. గుండె పరంగా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ లేకపోయినా ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. ‘యాంటీ కో ఆగ్జిలేషన్‌’మందులు కనీసం నెలవరకు వాడితే గుండె సంబంధిత మరణాలు తగ్గినట్టు ఒక పరిశోధనలో వెల్లడైంది.  
– డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి 

కోవిడ్‌ నుంచి కోలుకున్నాక ‘పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌’ అనేది 2,3 నెలల దాకా ఉంటుంది. పేషెంట్ల శరీర సత్తువ, రోగనిరోధకత, శారీరక దృఢత్వం, అంతకుముందు చేస్తున్న పనులను బట్టి దీని ప్రభా వాలు ఆధారపడి ఉంటాయి. ఈ సిండ్రోమ్‌లో వచ్చే సమస్యలు ఎక్కువగా జీర్ణకోశ వ్యవస్థతో ముడిపడి నవే. అజీర్తి, వాంతులు, నీళ్ల విరేచనాలు, గుండెద డ, దగ్గు, జ్వరం, కీళ్లు, కండరాల నొప్పులు కనీసం మూడునెలల వరకు ఉంటున్నాయి. అందువల్ల మసాలాలతో కూడిన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు, వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, ఫలాలు రెగ్యులర్‌గా తీసుకోవాలి.

కండరాలు, కీళ్ల నొప్పులకు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపని పెయిన్‌ కిల్లర్లు వాడాలి. గుండెదడ ఎక్కువగా ఉండి వేగంగా కొట్టుకునే వారు 2డీ ఎకో, ఈసీజీ తీసుకుని, డాక్టర్ల సూచనల మేరకు మందులు వేసుకోవాలి. డాక్టర్ల సూచనతో ఎంతవరకు చేయగలుగుతారో, శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకే నడక, శారీరక శ్రమ, ప నులు, వ్యాయామాలు  చే యాలి. క్రమంగా వీటిని పెంచాలి. మానసిక, ఇతర ఒత్తిళ్ల నుంచి ఉపశమనాని కి ధ్యానం, యోగా చేయా లి.

కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో భాగంగా నెలపాటు తలనొప్పి, ముక్కుకు రెండువైపులా నొప్పి, పంటి నొప్పులు, కంటిపైన వాపు, అంగిలిపై నల్లటి మచ్చలు, ముక్కులోంచి నల్లటి ద్రవాలు లేదా చెడువాసన వంటి వాటిని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఆక్సిజన్‌ శాచురేషన్‌ పరీక్షించుకుంటూ ఉండాలి. పోస్ట్‌ కోవిడ్‌లో సడన్‌గా బలహీనంగా కావడం లేదా ఉత్తేజితులు కావడం, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలతో కూడా పేషెంట్లు వస్తున్నారు. కడుపునొప్పి, వాంతులు, మోషన్‌లో రక్తం వంటివి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. 
– డాక్టర్‌ ఎ.నవీన్‌రెడ్డి, జనరల్‌ మెడిసిన్, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, నవీన్‌రెడ్డి ఆసుపత్రి   

చదవండి: Coronavirus: పెరిగిన కొత్త కేసులు, రికార్డు స్థాయిలో మరణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement