‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!  | Pub owner harassed by Banjarahills police | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది! 

Published Sat, Oct 7 2023 4:10 AM | Last Updated on Sat, Oct 7 2023 4:49 PM

Pub owner harassed by Banjarahills police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్‌ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నరేందర్, ఎస్సై ఎస్‌.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్‌ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది.

దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్‌ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్‌ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు.  

మామూలు పెంచి ‘ఎరియర్స్‌’ ఇమ్మని... 
బంజారాహిల్స్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్‌ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్‌ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్‌ తన పరిధిలో ఉన్న పబ్స్‌ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు.

అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్‌’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని రాక్‌ క్లబ్‌ అండ్‌ స్కై లాంజ్‌ పబ్‌ను లక్ష్మణ్‌ రావు, శివలాల్‌ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్‌ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ  రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్‌ కాల్స్‌ చేయించాడు.  

హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... 
పబ్‌ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్‌.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్‌ క్లబ్‌ అండ్‌ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు,  అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు.

సదరు పబ్‌ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్‌ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న  మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన  కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది.  

ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... 
ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్‌ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్‌ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు.

ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్‌ జోలికి రావద్దని ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్‌ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్‌ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్‌ ఫైల్‌8 దుమ్ము దులిపించారు.
 
ఓసారి షుగర్‌ డౌన్‌... మరోసారి ఛాతి నొప్పి...  
ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్‌ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయంటూ నరేందర్‌ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు.

సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్‌ వెళ్ళడానికి నరేందర్‌ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌.. ‘ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్‌ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్‌ రావును అనవసరంగా పబ్‌ బయటకు పిలిచారు.

రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement