
విద్యార్థి మెడపై గాయం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్‌లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు.
హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు.
అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది.