![18 Years Old Boy Missing Fraom Jadcherla Says He Will Take Asceticism - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/20/123.jpg.webp?itok=YAxqS5xN)
సాక్షి, మహబూబ్‌నగర్: చక్కటి విద్య, క్రమశిక్షణ అలవడుతుందని రూ.లక్షలు ఫీజు చెల్లించి ఓ గురుకుల విద్యాలయంలో తమ కుమారుడిని చేర్పిస్తే.. ఆధ్యాత్మిక చింతను ఎక్కువగా అలవరిచి చివరికి కన్నవారికే దూరం చేశారని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. జడ్చర్లలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న సింహ్మయ్య, పారిజాత దంపతులకు మణిదీప్(18) ఒక్కగానొక్క కుమారుడు. భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, మంచి విద్య అలవర్చాలన్న ఉద్దేశంతో జడ్చర్ల శివారులోని ఓ గురుకుల విద్యాలయంలో 6వ తరగతిలో జాయిన్ చేశారు. పదో తరగతి వరకు అదే గురుకులలో చదివిన మణిదీప్ ఇంటర్ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తిచేశాడు.
గతంలో ఒకసారి..
అయితే 3 నెలల కిందట మణిదీప్ అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణిదీప్ తాను విద్యనభ్యసించిన గురుకుల అనుబంధ విద్యాలయం బెంగుళూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన మణిదీప్ ఇక తాను ఇంటికి రానని, సన్యాసం స్వీకరిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అప్పట్లో అక్కడి స్వామీజిలు నచ్చజెప్పి ఇంటికి పంపారు. వారం రోజులు ఇంటి దగ్గర ఉండి రెండు నెలల కిందట మళ్లీ కనిపించకుండాపోయాడు.
చదవండి: మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడి నుంచి ఒకటి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడిన మణిదీప్ తాను సన్యాసం స్వీకరించేందుకు అనుమతి పత్రం ఇవ్వాలని లేకుంటే తాను ఇంటికి రానని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక గురుకుల నిర్వాహకులను సంప్రదించి తమ కుమారుడిని అప్పగించాలని కోరారు. ప్రస్తుతానికి అంగీకార పత్రం ఇవ్వాలని, ఆ తర్వాత మణిదీప్‌ని ఇంటికి తిరిగి తీసుకువస్తామని గురుకుల నిర్వాహకులు చెప్పడంతో సన్యాస స్వీకరణకు సమ్మతిస్తూ లెటర్ ఇచ్చారు.
తర్వాత తమ కుమారుడు ఈ నెల 5న బెంగుళూరు నుంచి బయలుదేరినట్లు అక్కడి స్వామీజీలు చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్నారు. మణిదీప్ విషయమై స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు గురుకుల నిర్వాహకులతో సోమవారం ఆందోళనకు దిగారు. మణిదీప్‌ను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment