
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగించారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన యాత్ర 10 గంటల సమయంలో కొత్తురుకు చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్న రాహుల్.. మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి.. రాత్రి ఏడు గంటలకు తొండుపల్లిలో బస చేశారు. కాగా సాయంత్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తొండుపల్లి, షాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ కాళ్లపై పడిన కార్యకర్త
జోడో యాత్రలో ఓ వ్యక్తి పోలీసు భద్రతా వలయాన్ని దాటు కుని వచ్చి రాహుల్ గాంధీ కాళ్లపై పడటం కలకలం రేపింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని లాగేశారు. ఆ వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించి వదిలేసినట్టు సమాచారం. ఇక మరో వ్యక్తి కూడా పాదయాత్రలోకి చొచ్చుకువచ్చి రాహుల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ పిలవడం వల్లే ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని దాటి ఆయన వద్దకు వచ్చారని.. పాదాలను తాకి, ఫొటోలు తీసుకునేందుకు యత్నించారని బాలానగర్ డీసీపీ సందీప్ పేర్కొనడం గమనార్హం.
బస్సుపై ఎక్కి.. సెల్ఫీ దిగి..
రాహుల్ పాదయాత్రగా వస్తున్న సమయంలో పాల్మాకుల వద్ద రోడ్డు పక్కన కొందరు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రాహుల్ గాంధీకి అభివాదం చేశారు. వారిని గమనించిన రాహుల్ స్వయంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. రాహుల్ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా బస్సుపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment