Reasons Behind Murder Of High Court Advocate Couple In Peddapalli - Sakshi
Sakshi News home page

న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు

Published Thu, Feb 18 2021 4:09 PM | Last Updated on Thu, Feb 18 2021 8:16 PM

Reasons Behind VamanRao Murder Case In Peddapalli - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్  రావు, నాగమణి దారుణ హత్య కేసుకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయపడుతోంది. ఘటన వెనుక దాడి ఉన్న అనేక నిజాలు వెల్లడవుతున్నాయి. స్థానికులు, బాధితుల సమీప వ్యక్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాది వామన్‌రావు అనేక వివాదాస్పద కేసులను టెకప్ చేస్తున్నారు. అంతేకాకుండా గుంజపడుగు గ్రామంలోని రామ స్వామి గోపాల స్వామి ఆలయ కమిటీ విషయంలో గతకొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. దీనిలో ఓ వర్గానికి చెందిన వారు రెండు గ్రూపులుగా విడిపోయారు. గట్టు వామన్ రావు ఒక గ్రూపుకు, రిటైర్డ్ డీఈ వెల్ది వసంతరావు మరో గ్రూపుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గట్టు వామన్ రావు సోదరుడు ఇంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీని కాదని సర్పంచ్ కుంట రాజుకు తెలియకుండా ఆయన సోదరుడు కుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో వసంతరావు మరో కమిటీని ఏర్పాటు చేశారు.

రాజు, శ్రీనివాస్‌ మధ్య విభేదాలు..
అయితే సర్పంచ్‌ కుంట రాజుకు, కుంట శ్రీనివాస్‌కు మధ్య ఎప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. గత సర్పంచ్‌ ఎన్నికల్లో శ్రీనివాస్‌పై పోటీచేసిన రాజు విజయం సాధించారు. అప్పటికే మాజీ ఎంపీటీసీగా ఉన్న శ్రీనివాస్‌ ఓటమిని జీర్ణించుకులేక పోయాడు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ కక్షలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఈనెల 22 నుంచి 25 వరకు ఆలయంలో జరిగే చండీయాగం పాత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని వామన్ రావు వర్గం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కొత్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వసంతరావు సైతం సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వివాదం పెద్దదిగా మారడంతో సర్పచ్‌ రాజు సూచనల మేరకు హైకోర్టులో ఫిల్  వేయడానికి వామన్‌రావు దంపతులు సిద్ధమయ్యారు. స్థానికులు, కమిటీ సభ్యుల సంతకాలు తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరగా.. దారి మధ్యలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆలయ విషయంలో వసంతరావు కుట్ర పన్నాడని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య చేసింది మాత్రం కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ అని స్పష్టంచేస్తున్నారు.

కీలకంగా మారిన ఆడియో క్లిప్‌..
వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్‌ను, ఏ–2గా అక్కపాక కుమార్‌ను, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. మృతుడు వామన్‌రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్‌ డేటాను అనాలసిస్ చేయగా... ‘గుడి కూలితే వామన్‌రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ లభించింది. విచారణలో ఇది కీలకంగా మారనుంది. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంటా శ్రీనివాస్‌పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుంట శ్రీనివాస్‌ను త్వరిగతిన అరెస్టు చేస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నాం వీరిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా లాయర్ల హత్య..
మరోవైపు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ  విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి పరోక్షంగా హైకోర్టు చురకలు అంటించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలన్న  సూచించడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తును పూర్తి చేయాలన్న హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. న్యాయవాదుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు ఎక్కడికక్కడ నిరసనకు దిగారు. హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. హైకోర్టుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో న్యాయవాదులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. వామనరావు ఫ్యామిలీ జంట హత్యలపై సిట్టింగ్ జడ్పీ తో విచారణ జరిపించి.. సీబీఐకి కేసు విచారణ అప్పగించాలని డిమాండ్ చేశారు.  న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ వచ్చే వరకు పోరాటం ఆగదని న్యాయవాద సంఘాలు హెచ్చరించాయి.

అంత్యక్రియలు పూర్తి
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు హాజరయ్యారు. దంపతుల హత్యతో గుంజపడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  వారి అంతిమ సంస్కాలు పూర్తి అయ్యాయి. ఇంటి నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పాల్గొన్న వారంత కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం గోదావరి ఒడ్డున దహన సంస్కారం పూర్తిచేశారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement