సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు హబ్‌గా మారిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని ఎంతో వృద్ధి సాధించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని, మిగతా వాటికీ త్వరలో వచ్చేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో 2014–15లో 2,950 ఎంబీబీస్ సీట్లు ఉంటే, ప్రస్తుతం 7,090కు చేరాయని, పీజీ సీట్లు 1183 నుంచి 2548కు పెరిగాయని తెలిపారు. 65 మందికి కొత్తగా ప్రొఫెసర్ పదోన్నతులు ఇచ్చామని, 210 అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు త్వరలో ఇవ్వబోతున్నామని తెలిపారు. త్వరలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ పక్రియ పూర్తి అవుతుందన్నారు. 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు కేటాయించామ తెలిపారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జిల్లాలోనే జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. డిశ్చార్జ్ అయిన రోగులకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని, ఈ విష యం రోగులకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి వేళల్లో సైతం పోస్టుమార్టం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
108 సేవల కోసం 200 కొత్త అంబులెన్స్‌లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో 108 సేవల కోసం కొత్తగా 200 అంబులెన్స్‌లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్స్‌ల స్థానంలో ఈ కొత్త అంబులెన్స్‌లు సేవలందిస్తాయని ప్రకటించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment