సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని జోనల్ కమిషనర్లందరికీ సూచించింది.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సమీక్షించాలి
రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎస్.. ఆదివారం అక్కడినుంచే కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గులాబ్ తుపాను ప్రభావం మరో రెండురోజుల పాటు మొత్తం రాష్ట్రంపై ఉండనుందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. పోలీస్, ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.
ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకూడదు
లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కోరారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్ సేవలను పొందాలని చెప్పారు. వాగులు, వంకల్లో వరద నీరు ప్రవహించే సమయంలో ప్రజలు దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేకంగా అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు.
ఇప్పటివరకు 94.4 సెం.మీ. వర్షపాతం
నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 94.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్1 నుంచి ఆదివారం నాటికి 70.4 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 34 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డిలో 9.38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment