సాక్షి, సికింద్రాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని దక్కన్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు భవనంలోకి రెండో అంతస్తు కూడా వ్యాప్తించాయి. ఎగిసిపడుతున్న మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాద స్థలంలో దాదాపు 4 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, అగ్ని ప్రమాద భవనానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తోంది. దక్కన్ స్టోర్ నుంచి పొగలు ఆసుపత్రికి వరకు వెళ్తున్నట్టు సమాచారం.
అగ్నిమపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఇదిలా ఉండగా.. దక్కన్ స్టోర్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు వ్యాప్తి చెందాయి. తాజాగా దక్కన్ స్టోర్ బిల్డింగ్ లోపల నుంచి పేలుడు శబ్దాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఎంతకు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో మంటలు, తీవ్రమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాగా, మంటల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఇక, రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడారు. భవనం దగ్గరికి ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యం అవుతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిపారు. అవసరమైనే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు.. మంటలు అదుపులోకి రాకపోతే కెమికల్స్ సాయంతో అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, మంటలు అదుపులోకి రావడానికి మరిన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మంటలు ఇలాగే చెలరేగితే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment