సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ గోడౌన్ అగ్నిప్రమాదంలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహానికి సంబంధించిన ఎముకలు, సగం కాలిన పుర్రెను హైదరాబాద్ క్లూస్ టీమ్ శిథిలాల నుంచి రికవరీ చేసింది. గురువారం ఈ ప్రమాదం జరగ్గా శనివారం సాయంత్రం ఇవి లభించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందే ఉంటారని, వాళ్ల ఎముకలు స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. భవనంలోని పరిస్థితులు ఇప్పటికీ నేరుగా అడుగు పెట్టడానికి అనువుగా లేకపోవడంతో విక్టిమ్ లొకేషన్ కెమెరా(వీఎల్‌సీ)తో కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. శుక్రవారం వాడిన డ్రోన్‌కు అదనంగా శనివారం మరొకటి వినియోగించగా... ఆదివారం కూడా ఈ గాలింపు ప్రక్రియ జరుగనుంది.
లిఫ్ట్ వద్ద షట్టర్ మూసి ఉండటంతో...
గోదాములో అగ్నిప్రమాదం జరిగి పొగలు వస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులైన జునైద్, వశీం, జహీర్ అక్కడే ఉన్నారు. అప్పటికే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పైఅంతస్తుల్లో ఇరుక్కున్న నలుగురు కూలీలను రెస్క్యూ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘డెక్కన్’ యజమాని ఆదేశాల మేరకు ముగ్గురు ఉద్యోగులు మొదటి అంతస్తులో ఉన్న సరుకు తీసుకురావడానికి లోపలకు ప్రవేశించారు.
ఇది జరిగిన కొద్దిసేపటికే పొగతో పాటు మంటలూ ఎక్కువ కావడం.. అవి మొదటి అంతస్తును చుట్టేయడంతో ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న లిఫ్ట్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదటి అంతస్తుకు, లిఫ్ట్‌కు మధ్య ఉండే షట్టర్ లాక్ చేసి ఉండటంతో అక్కడే ఉండిపోయి పొగ వల్ల మరణించడమో, లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి సజీవ దహనం కావడమో జరిగి ఉంటుందని అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు చెబుతున్నారు.
కూలిన శిథిలాల్లో మరో ఇద్దరి అవశేషాలు...
ఈ భవనానికి వెనుక వైపుగా దాదాపు అన్ని ఫ్లోర్లకు సంబంధించిన శ్లాబ్స్ కూలిపోయాయి. మొదటి అంతస్తులో ఉన్న షట్టర్ వద్దా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. షట్టర్ పక్కన గోడ వద్ద ఉన్న యువకుడి మృతదేహంపై శ్లాబ్ ముక్కలు పడటంతో స్వాధీనం చేసుకున్న ఎముకలు మాత్రమే మిగిలాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన ఇద్దరూ చనిపోయే ఉంటారని, వారి ఎముకలు వంటి అవశేషాలు శకలాల్లో పడిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఆదివారం వీటి కోసం గాలించాలని భావిస్తున్నారు. ఈ అవశేషాలను బయటకు తీసుకురావడానికి క్లూస్ టీమ్‌తో పాటు డీఆర్‌ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. సిటీ క్లూస్‌టీమ్ అధికారులు తమ వద్ద ఉన్న 3డీ స్కానర్‌తో భవనాన్ని విశ్లేషించారు. ఆపై భవనం ఎడమ వైపున ఉన్న సందు నుంచి వెనక్కు వెళ్లారు. అక్కడ కిటికీ సహాయంతో లోపలకు వెళ్లి సగం పడిపోయిన గ్రిల్ ఎక్కడం ద్వారా మొదటి అంతస్తునకు చేరుకున్నారు. అక్కడ శనివారం సాయంత్రానికి కూడా వేడిగానే ఉండటం గమనార్హం.
డీఎన్‌ఏ పరీక్షలకు మాంసం, ఎముకలు..
ఈ అవశేషాలను శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్లూస్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, లాలాపేట క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ సేకరించారు. వీటిని తొలుత గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సగం కాలిన పుర్రె, కాళ్లు, చేతులకు సంబంధించిన కీలు, తొడ ఎముకలు ఉన్నాయి. తొడ ఎముక వద్ద కొంచెం కాలిన మాంసం కూడా లభించింది. దీన్ని సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపనున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురి బంధువులు నగరానికి చేరుకోవడంతో వారి నుంచి నమూనాలు తీసి ఆ మాంసంతో పోల్చనున్నారు.
ఈ నివేదిక వచ్చిన తర్వాతే అది ఎవరి మృతదేహానికి సంబంధించినదో తేలుతుందని నిపుణులు చెప్తున్నారు. ‘చెల్లా చెదురుగా దొరికిన ఎముకలు తదితరాలు కూడా 80 శాతం కాలిపోయాయి. గట్టిగా పట్టుకుంటే బూడిదలా మారేలా ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో డీఎన్‌ఏ నివేదిక వస్తుంది’ అని డాక్టర్ వెంకన్న తెలిపారు. భవనం లోపల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో ఇద్దరికి సంబంధించిన అవశేషాలైనా దొరుకుతాయా లేదా అనే సందేహాలూ నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment