
వ్యాక్యూమ్ ట్యాంకర్ ద్వారా తొలగింపునకు యత్నాలు
సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు
చివరి 40 మీటర్ల స్థలంలో తవ్వేందుకు రోబోల వినియోగం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలంలో చివరి 40 మీటర్లలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా, ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు.
ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషినరీని తీసుకెళ్లారు. శనివారం దానికి అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్‌ను సొరంగంలోకి తరలించారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టిని కన్వేయర్ బెల్టు మీదుగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో ఆదివారం ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
డీ1 వద్ద తవ్వకాలు పూర్తయితేనే..
ఇప్పటికే కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించగా, మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ డీ1 వద్ద సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. డీ1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది.
డీ1 వద్ద టీబీఎంలో సెగ్మెంట్ ఎరెక్టర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తికావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment