సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు ఈనెల 13వ తేదీన అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ మేడిపండు ఎలా అయిందో అందరూ చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా రావాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఆ కుర్చిని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా? అని ప్రశ్నించారు.
80 వేల పుస్తకాలు చదివిన ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. మేడిగడ్డపై విచారణ జరుగుతోందని, కొన్ని నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టే వీలుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కాకుండానే విపక్షం పిల్లి శాపనార్థాలు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు నిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజా ప్రయోజనం కోసం విపక్షం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఉద్యమ సమయంలోనే టీజీగా రాసుకున్నారు
‘తెలంగాణ రాష్ట్రానికి సూచికగా టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష. ఉద్యమ సమయంలో యువత రక్తంతో దీన్ని రాసుకుంది. తర్వాత టీజీని కేంద్రం నోటిఫై చేసినా బీఆర్‌ఎస్ విస్మరించింది. బీఆర్‌ఎస్ సర్కార్ దానిని టీఎస్‌గా మార్చడం వారి అహంకారానికి ప్రతీక. అయితే దీన్ని మేము టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాచరికపు ఆనవాళ్ళను స్ఫురింపజేసేలా బీఆర్‌ఎస్ సర్కార్ అధికార చిహ్నం రూపొందిస్తే, మేం దాన్ని ప్రజాస్వామ్య చిహ్నంగా మార్చాం. అలాగే దళిత బిడ్డ రాసిన తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ’కన్పించకుండా కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది. కానీ మా సర్కార్ దాన్ని రాష్రీ్టయ గీతంగా ఆమోదించింది..’అని సీఎం చెప్పారు.
ప్రజాపాలనపై సత్యదూరమైన ఆరోపణలు
‘ప్రజాపాలనపై విపక్షం సత్యదూరమైన ఆరోపణలు చేస్తోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పినదాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 12 శాఖలకు చెందిన 21 మంది అధికారులను అందుబాటులో ఉంచాం. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో అవకతవకల వల్లే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మేము మేనేజ్‌మెంట్ కోటా కింద వచ్చిన వాళ్ళం కాదు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చాం. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ప్రగతి భవన్ కంచెలు తొలగించాం. కాళోజీ కవిత్వం గురించి చెప్పే బీఆర్‌ఎస్ నేతల పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి కాలేదు..’అని రేవంత్ ప్రశ్నించారు.
ఇక మొదటి తేదీనే జీతాలు
‘మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం దివాలా తీసిందనడం ఏమిటి? పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపోతుందా? ఉద్యోగులు, పెన్షనర్లకు 25వ తేదీ దాకా జీతాలు ఇవ్వలేని చరిత్ర వాళ్ళది. మేము 4వ తేదీలోగానే జీతాలు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మొదటి తేదీనే ఇస్తాం. రైతు బంధు వేయడం లేదంటూ విపక్షం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో 2018–19లో యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలలు, 19–20లో 9 నెలలు, 20–21లో 4 నెలలు, 22–23లో 4 నెలలు తీసుకున్నారు. ఇలాంటి వాళ్లు మమ్మల్ని విమర్శించడం ఏమిటి? పెన్షన్లు 80 శాతం చెల్లించాం. మిగిలినవి 15వ తేదీలోగా చెల్లిస్తాం..’అని రేవంత్ తెలిపారు.
ఆటోరాముళ్ళ హైడ్రామా
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతోందంటూ వాళ్ళను రెచ్చగొట్టడం రాజకీయమే. జూనియర్ ఆరి్టస్టుల తరహాలో ఆటోరాముళ్ళు ఆటోలెక్కి అసెంబ్లీకి రావడం, ఆటోలో కూడా కెమెరా పెట్టడం ఓ హైడ్రామా. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే 15.21 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. రూ.535.52 కోట్లు ఆరీ్టసికి ఇచ్చాం. మహిళలు ఈ సదుపాయం వినియోగించుకుని గుళ్ళకు వెళ్ళడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం నవంబర్‌లో రూ.49.28 కోట్లు ఉంటే, డిసెంబర్‌లో రూ.93.24 కోట్లకు పెరిగింది. జనవరిలో కూడా రూ.68.69 కోట్ల ఆదాయం వచ్చింది..’అని సీఎం వివరించారు.
గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచుతాం
‘ఉద్యోగాల కల్పన మా విధానం. మేం వచ్చిన రెండు నెలల్లోనే 6,956 స్టాఫ్ నర్సుల నియామకం, సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలోనే 15 వేల పోలీసు నియామకాలు చేపడతాం. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచి నియామకాలు చేపడతాం. పాలక మండలి రాజీనామా చేయకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న బీఆర్‌ఎస్ ఎన్ని ఇచ్చిందో చెప్పాలి.
మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్
సీఎం పేషీలో మైనారీ్టలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. కేసీఆర్ పాలనలో వాళ్ళ కుటుంబ సభ్యులకే కారుణ్య నియామకాలు దక్కాయి. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం చేపడతాం. ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పుకునే బీఆర్‌ఎస్ నేతలు, తాను పుట్టిన ఊరును రెవెన్యూ గ్రామం చేయాలన్న ఆయన చివరి కోరికను కూడా పట్టించుకోలేదు. మేము దాన్ని నెరవేర్చాం.
ఆదివాసీల పోరాట యోధుడు కొమరం భీంను కూడా విస్మరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారసులను ఆదుకుంది. ఇంద్రవెల్లి అమర వీరులను కూడా ఆదుకున్నాం. కవి గూడ అంజన్న చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించ లేదు. ప్రగతి భవన్ వద్ద గద్దర్ మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారు. మేము ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తుండేలా ఆయన పేరుతో పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది ఎవరు..’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కృష్ణా జలాలపై వాగ్వాదం
కృష్ణా జలాలపై కేంద్రానికి అధికారం ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ చేసిన విమర్శ సభలో వాగ్వాదానికి దారి తీసింది. కృష్ణా బోర్డు వద్ద సంతకాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులపై అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపిందంటూ బోర్డ్ మినిట్స్‌ను ఆయన ప్రస్తావించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బదులిస్తూ తాము దాన్ని వ్యతిరేకించామని, అధికారులు కేంద్రానికి లేఖ కూడా ఇచ్చినట్టు తెలిపారు. బోర్డు నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అంగీకరించి బడ్జెట్‌లో నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే నిధులు ఇస్తామని చెప్పామని, అది జరగలేదు కాబట్టే నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు బదులిచ్చారు. ఆ తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment