సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని కాదని, అది తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ కలసి తెలంగాణకు చెదలు పట్టించారని, వారు ఎంత ద్రోహం చేశారో ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలోనే పురుగులా పుట్టిందని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని విమ ర్శించారు.
మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు అవాంఛనీయమని, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఐదుగురు సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఖజానాను కొల్లగొట్టడానికే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలో.. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..
‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1,850 ఎకరాల పట్టా భూమి మునుగుతుందని, గ్రామాలేవీ ముంపునకు గురికావని తేల్చారు. అదే 150 మీటర్ల ఎత్తుతోనే కడితే 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని గుర్తించారు. ప్రాణహిత–చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు నాటి మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి ఏపీ సీఎం చర్చించారు. 2012లో స్టాండింగ్, కో–ఆర్డినేషన్ కమిటీలు వేశారు.
మేడిగడ్డ నిరుపయోగమని చెప్పినా..
తెలంగాణ వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు.. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరామ్ నేతృత్వంలో ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ 14 పేజీలతో నివేదిక ఇచ్చింది. అప్పటికే శంకుస్థాపన కూడా చేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కాకపోతే 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించాలని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు అవాంఛనీయమని తేల్చి చెప్పింది. అయినా మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టడం సరికాదంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచి్చన నివేదిక ఆధారంగా 2015 సెపె్టంబర్‌లో ‘సాక్షి’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.
సభలో క్షమాపణలు చెప్పాలి
కేసీఆర్, హరీశ్ కలసి ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టారు. రూ.38వేలకోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌రావుకు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశి్నస్తారా? ప్రాజెక్టులు ఫక్కున పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? హరీశ్‌రావును నేను నిలదీస్తున్నా..
ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు వద్దు. ప్రాణహిత–చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. నాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇప్పుడు మౌనంగా హరీశ్‌రావు గారిని సమరి్ధస్తున్నారా? జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు.. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో నాటి మంత్రులు కన్ఫెక్షన్ స్టేట్‌మెంట్ ఇచ్చి తప్పులు ఒప్పుకోవాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు.
కేసీఆర్‌కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సభను సజావుగా నడిపించడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాగునీటి రంగంపై శాసన సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం ఈ మేర కు ప్రకటన చేశారు. కేంద్రమంత్రి, మంత్రి, సీఎంగా వివిధ హోదాల్లో 40 ఏళ్లు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment