మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు, సభ్యులు
ఒకేరోజు కులగణన, ఎస్సీల వర్గీకరణపై ‘నివేదిక’లకు కేబినెట్, అసెంబ్లీ ఆమోదం
ఎస్సీలకు క్రీమీలేయర్ సిఫార్సుకు మాత్రం కేబినెట్ తిరస్కరణ
ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈ రోజు తన రాజకీయ జీవితంలో మర్చిపోలేనిదని వెల్లడి
దేశవ్యాప్త జనగణనలో కులగణనను భాగం చేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
శాసనమండలిలో భట్టి ప్రకటన..రెండు ‘నివేదిక’లకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక సామాజిక ప్రక్రియలు మంగళవారం ఒకేరోజు పూర్తయ్యాయి. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నివేదికతో పాటు ఎస్సీల వర్గీకరణ అంశంలో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. కుల సర్వే నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను, ఏకసభ్య కమిషన్ నివేదికను అసెంబ్లీ ఆమోదించింది. మంత్రివర్గం, ఆ తర్వాత అసెంబ్లీలో ఈ రెండు అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది.
తొలుత దాదాపు రెండున్నర గంటల పాటు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ భేటీలో రెండు నివేదికలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీలో రెండు అంశాలపై వేర్వేరుగా దాదాపు ఎనిమిది గంటలకు పైగా చర్చ జరిగింది. కులగణన సర్వేపై సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటన చేశారు. సభ చివరలో ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా (సోషల్ జస్టిస్ డే)గా పాటిద్దామని పిలుపునిచ్చారు. ఈ రోజు తన రాజకీయ చరిత్రలో మర్చిపోలేనిదన్నారు.
కులగణనపై వాదోపవాదాలు
సీఎం కులగణన ప్రకటన ప్రవేశపెట్టిన తర్వాత బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గతంలో నిర్వహించిన సమగ్ర కుల సర్వే (ఎస్‌కేఎస్)లోని గణాంకాలు, ప్రస్తుత సర్వే నివేదికలోని గణాంకాలపై వాగ్వాదం జరిగింది. అనంతరం కులగణన నివేదికను ఆమోదించిన అసెంబ్లీ.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చేపట్టనున్న జనగణనలో కులగణనను కూడా భాగం చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ తర్వాత ఎస్సీల వర్గీకరణ నివేదికపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఎస్సీలను మూడు కేటగిరీలుగా విభజించి 1, 9, 5 శాతం చొప్పున మొత్తం 15 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో క్రీమీలేయర్ పాటించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసినప్పటికీ, ఆ ప్రతిపాదనను మంత్రిమండలి తిరస్కరించిందని చెప్పారు. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ అంశంపై మాట్లాడారు.
చివర్లో ముఖ్యమంత్రి మరోసారి ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. అనంతరం ఈ నివేదికను అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలిలోనూ ఈ రెండు నివేదికలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ప్రభుత్వం తరఫున రెండు నివేదికలపై ప్రకటనలు చేశారు. దీనిపై చర్చలో పాల్గొనకుండా బీఆర్‌ఎస్ వాకౌట్ చేయగా, ఇతర సభ్యులు చర్చించి ఆమోదించారు.
నా కోసం ఏదైనా పేజీ రాసుకోవాల్సి వస్తే అది ఫిబ్రవరి 4 గురించే..
అసెంబ్లీలో బీసీల కులగణనపై చర్చ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తన రాజకీయ చరిత్రలో చాలా కీలకమని, తన కోసం ఏదైనా పేజీ రాసుకోవాల్సి వస్తే ఫిబ్రవరి 4 గురించే రాయాల్సి ఉంటుందని చెప్పారు. నివేదిక మొత్తాన్ని సభ ముందు ఉంచాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి.. మంచి కోరి తాము చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా దీనికి చట్టబద్ధత కల్పించాల్సి ఉందన్నారు.
అమరులకు నివాళులు
ఎస్సీల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా జరిగిన పోరాటంలో అమరులైన వారికి సీఎం నివాళులర్పించారు. వారి పోరాటం వృధా కాకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. భవిష్యత్తులో జనగణన చేపట్టినప్పుడు అందులో కులగణన చేపట్టాలే కేంద్రంపై ఒత్తిడి తెద్దామని చెప్పారు.
సున్నిత అంశాలకు సాహసోపేత పరిష్కారం
రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన సున్నిత అంశాలను అత్యంత సాహసోపేతంగా పరిష్కరించగలిగామని కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అటు బీసీలు, ఇటు ఎస్సీలకు సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు అపోహలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని, మంచి చేయాలనుకుంటున్న తమకు చెడును ఆపాదించే విధంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని చెప్పినట్టు సమాచారం. అలాంటి వాటిని అడ్డుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. సమగ్ర కుల సర్వేకు ఎలాంటి అధికార ఆమోదం, శాస్త్రీయత లేదని, ఒక్కరోజులో అడ్డగోలుగా నిర్వహించిన ఆ సర్వే గణాంకాలను ప్రజల్లో పెట్టేందుకు బీఆర్‌ఎస్ శతథా ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
కులగణన నివేదికను ఆమోదించడంతో పాటు జనగణనలో భాగంగా కేంద్రం కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసినందుకు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బీసీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సన్మానించారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఈర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి తదితరులున్నారు. కాగా ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సందర్భంగా మంత్రి దామోదార రాజనర్సింహ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment