సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధొస్తుంది | Revanth Reddy comments on BRS MLAs | Sakshi
Sakshi News home page

సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధొస్తుంది

Published Sat, Aug 3 2024 4:20 AM | Last Updated on Sat, Aug 3 2024 4:20 AM

 Revanth Reddy comments on BRS MLAs

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు 

వారి తీరును ఓపికతో చూస్తున్నాం.. 

హైదరాబాద్‌లో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి  

ట్రాఫిక్‌ నియంత్రణకు కమిషనర్లు బయటకు రావాలి.. లేకుంటే నేనే చేస్తా

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు చెందిన అరడజను మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే అప్పుడు వారికి బుద్ధొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డిని, సంపత్‌కుమార్‌ను గత సభలో ఏం చేశారో మనం చూడలేదా? అని అన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరును ఓపికతో చూస్తున్నామని అన్నారు. దానం నాగేందర్‌ సభలో మాట్లాడితే తప్పేంటని, ఓ సభ్యుడికి మైక్‌ ఇవ్వొద్దనే అధికారం వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. లాంగ్వే జ్, నాలెడ్జ్‌ వేర్వేరని కేటీఆర్‌ తెలుసుకోవాలన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

30 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి 
‘మిషన్‌ భగీరథ ద్వారా గజ్వేల్‌కు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కేటీఆర్‌కు నేను సవాల్‌ విసురుతున్నా. కాంగ్రెస్‌ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చే నీటినే మధ్య లో పైప్‌లైన్‌ ద్వారా గజ్వేల్‌కు అందించారు. మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది. కాళేశ్వరం కట్టడం, కూలడం అయిపోయింది. అయినా ఇంతవరకు డీపీఆర్‌ లేదు. కానీ మూసీ అభివృద్ధి పనులు మొదలు పెట్టకముందే కేటీఆర్‌ డీపీఆర్‌ అడుగుతున్నారు.

అప్పుడే ఏదో జరిగిపోయినట్టు ఎందుకు వాళ్లకు ఇంత బాధ. పది నెలలైనా కాకముందే మాపై ఎందుకింత ఆక్రోశం? 200 ఏళ్లు ఏలిన నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తలొగ్గారు. పదేళ్లు ఏలిన మీరెంత? మేము అమెరికాతో పాటు కొరియాకు కూడా వెళుతున్నాం. పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి అక్కడ చర్చలు జరుపుతాం. గ్రీన్‌ తెలంగాణ–2050 తయా రు చేస్తాం. మూసీ కబ్జాలను తొలగిస్తాం. మూసీపై 10,800 ఇళ్లు ఉన్నాయి.

వాటిని ఖాళీ చేయించి అవసరమైన వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తాం. గోషామహల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తాం. 30 ఎకరాల స్థలంలో నిర్మాణం చేస్తాం. ప్రస్తుతం ఆసుపత్రి ఉన్న భవనాన్ని హెరిటేజ్‌ బిల్డింగ్‌గా కొనసాగిస్తాం.. ’ అని సీఎం తెలిపారు. 

మీరాలం చెరువుపై సస్పెన్షన్‌ బ్రిడ్జి 
‘మీరాలం చెరువుపై 2.6 కిలోమీటర్ల సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మి స్తాం. లండన్‌ ఐ లాంటి టవర్‌ను మీరాలం చెరువులో నిర్మి స్తాం. దానికి హైదరాబాద్‌ ఐ అని పేరు పెడతాం. బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడితే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా యంటున్నారు. మొయినాబాద్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ నాయకుడు రేప్, మర్డర్‌ చేస్తే చర్యలు శూన్యం. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి అమ్మే దమ్ము ఎవరికైనా ఉందా?  రాష్ట్ర అభివృద్ధికి కలసి పనిచేద్దామని చెప్పినా కిషన్‌రెడ్డి ముందుకు రాలేదు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిని సచివాలయంలో సన్మానం చేసి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కోరాలని భావించాం. ఆ మేరకు ఆహా్వనించినా వారు స్పందించలేదు..’ అని రేవంత్‌ వెల్లడించారు.   

హైదరాబాద్‌ మెట్రోను వైఎస్సార్‌ తీసుకొచ్చారు 
‘హైదరాబాద్‌ మెట్రోను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. వైఎస్‌కు, చంద్రబాబుకు మధ్య భిన్నాభిప్రాయాలున్నా వారిద్దరూ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డును వైఎస్సార్‌ మణిహారంగా తీర్చిదిద్దారు. సైబరాబాద్‌ను కూడా వైఎస్సారే నిర్మించారు. మద్యం షాపులు మినహా రాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్‌లో వ్యాపారాల నిర్వహణకు అనుమతిస్తా. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్‌ను 2 వేల కిలోమీటర్ల వైశాల్యం వరకు విస్తరించనున్నాం. హైదరాబాద్‌ నగరాన్ని 12 జోన్లుగా విభజిస్తున్నాం. 12 మంది అధికారులను నియమిస్తాం..’ అని సీఎం చెప్పారు.  

రోడ్లపై నీళ్లు నిల్వకుండా హార్వెస్టింగ్‌ వెల్స్‌ 
‘భారీ వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్‌ వెల్స్‌ డిజైన్‌  చేయాల్సిందిగా అధికారులకు సూచించాం. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. ట్రాఫిక్‌ నియంత్రణకు హైదరాబాద్‌లోని పోలీసు కమిషనర్లు బయటకు రావాలి. వాళ్లు రోడ్లపైకి రాకపోతే నేనే ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తా. నగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలను నియంత్రించే బాధ్యత హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) తీసుకోనుంది..’ అని సీఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement