ఊరంతా విషాదమే | Road Accident In Telangana Kamareddy District Funerals | Sakshi
Sakshi News home page

ఊరంతా విషాదమే

May 10 2022 2:20 AM | Updated on May 10 2022 8:17 AM

Road Accident In Telangana Kamareddy District Funerals - Sakshi

చిల్లర్గి గ్రామంలో రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియల్లో  పాల్గొన్న గ్రామస్తులు

నిజాంసాగర్‌ / పిట్లం (జుక్కల్‌) / నిజామాబాద్‌ అర్బన్‌: కామారెడ్డి జిల్లాలోని బాన్సు వాడ – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అన్నా సాగర్‌ తండా వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ ట్రాలీ ఆటో, బియ్యం లారీ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

కాగా మృతుల్లో ఆరుగురు చిల్లర్గి గ్రామస్తులే కావడంతో ఊరు ఊరంతా గొల్లుమంది. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల రోదన లు మిన్నంటాయి. ఆటో ట్రాలీలో ఉన్న 25 మందిలో 23 మంది చిల్లర్గి గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం. సోమవారం గ్రామంలో చౌదర్‌పల్లి లచ్చవ్వ, వీరవ్వ, పో చయ్య, వీరమణి, సాయవ్వ, గంగవ్వ మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఒకేసారి ఆరుగురు చనిపోవడంతో.. కులమతాలకు అతీతంగా వందల సంఖ్యలో ప్రజ లు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇలావుండగా, పెద్దకొడప్‌గల్‌ మండలం కాటేపల్లిలో ఎల్లయ్య, తుప్‌దల్‌ గ్రామంలో డ్రైవర్‌ సాయిలు, బాన్సువాడలో అంజవ్వ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు.  

రెండు కుటుంబాలకు చెందిన నలుగురు అత్తాకోడళ్లు మృతి 
చిల్లర్గి గ్రామంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందగా ఇందులో రెండు కుటుంబాలకు చెందిన అత్తాకోడళ్లు ఉన్నారు. గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి లచ్చవ్వ, వీరమణి అత్తా కోడళ్లు కాగా, మరో కుటుంబానికి చెందిన చౌదర్‌పల్లి వీరవ్వ, గంగవ్వ కూడా అత్తా కోడళ్లే..  

ఎంపీ, కలెక్టర్‌ ఆర్థికసాయం 
అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌.. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున వేర్వేరుగా ఆర్థిక సహాయం అందజేశారు.

ఇద్దరి పరిస్థితి సీరియస్‌: ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఏడుగురు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 11 మందిని ఇక్కడికి తీసుకురాగా ఆదివారం ముగ్గురు మరణించారు. గంగవ్వ అనే మహిళ కోలుకోవడంతో ఇంటికి పంపారు. దీంతో మిగిలిన ఏడుగురిలో శ్రావణి, కార్తిక్‌ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులంతా ఎంఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

రోడ్డు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి 
సాక్షి, న్యూఢిల్లీ/నిజాంసాగర్‌ (జుక్కల్‌): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఏస్‌ ట్రాలీ ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు సోమవారం ట్విట్టర్‌ ద్వారా ఆయన సంతాపం తెలిపారు.

మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారు. అన్నాసాగర్‌ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి ఒక్కో కుటుంబానికి రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సహాయం, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement