రోబోటిక్‌ పోటీ.. ట్రిపుల్‌ఐటీ మేటి | Robotics Research Center In IIIT Campus In Gachibowli | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ పోటీ.. ట్రిపుల్‌ఐటీ మేటి

Published Fri, May 27 2022 12:37 AM | Last Updated on Fri, May 27 2022 8:51 AM

Robotics Research Center In IIIT Campus In Gachibowli - Sakshi

పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన సెరెబ్రస్‌ విద్యార్థుల బృందం

గచ్చిబౌలి (హైదరాబాద్‌): ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలోని రోబోటిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ రెండు ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది. ఇందులోని ‘సెరెబ్రస్‌’ టీమ్‌ ద్వితీయ స్థానం పొందగా, ‘లూమోస్‌’ తృతీయ స్థానం గెలుపొందింది. బెంగళూరులోని ఐఐఎస్‌సీలోని ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ టెక్నాలజీ పార్కులో ‘ఓపెన్‌ క్లౌడ్‌ టేబుల్‌ ఆర్గనైజేషన్‌ చాలెంజ్‌’ పోటీలు నిర్వహించారు.  ఈ పోటీల్లో 133 టీమ్‌లు పాల్గొన్నాయి. 

పోటీ ఇలా... 
కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తితో పారిశుధ్య కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలను నిర్వహించారు. వాష్‌రూమ్‌లో శుభ్రం చేసే పనుల కోసం రోబోను సృష్టించాలి. ఈ రోబో ద్వారా ఫ్లోర్‌పై ఉండే టిçష్యూపేపర్, చిన్న పేపర్‌ కప్పులు వంటి చెత్తను తొలగించడం, వాష్‌బేసిన్‌ను శానిటైజింగ్‌ లిక్విడ్‌తో శుభ్రపరచడం వంటి టాస్క్‌లు ఉన్నాయి.

ఈ టాస్క్‌లను ఎంత సమయంలో పూర్తిచేస్తారు, సోప్‌ డిస్పెన్సర్, ఇతర వస్తువులు పడిపోకుండా శుభ్రం చేయడంలో రోబో ప్రదర్శించిన నైపుణ్యం, వినియోగించిన హార్డ్‌వేర్‌ తదితరాల ఆధారంగా బృందాలకు స్కోర్‌ ఇచ్చారు. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 డిజైన్‌లను షార్ట్‌లిస్ట్‌ చేశారు. వీటిలో నుంచి 4 బృందాలు గ్రాండ్‌ ఫినాలే కోసం ఎంపికయ్యాయి. ఇక్కడ ఒక్కో జట్టుకు రోబో రూపకల్పన కోసం రూ.4 లక్షల బడ్జెట్‌ ఇచ్చారు.  

సూరజ్‌ నేతృత్వంలో సెరెబ్రస్‌ 
సెరెబ్రస్‌కు పీహెచ్‌డీ స్కాలర్, డ్రోన్‌ స్టార్టప్‌ ఆర్కా ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు సూరజ్‌ బోనగిరి నేతృత్వం వహించారు. ఇందులో వేదాంత్‌ ముందేదా, కరణ్‌ మిరాఖోర్, రాహుల్‌ కశ్యప్, శ్రీహర్ష పరుహురి, కర్నిక్‌ రామ్‌ ఉన్నారు. ‘ప్రతి బృందం అద్భుతమైన, ప్రత్యేకమైన డిజైన్‌లను రూపొందించింది. మా డిజైన్‌ రెండు అంశాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

రోబో పరిసరాలను గ్రహించడానికి, స్వయంప్రతిపత్తితో నావిగేట్‌ చేయడానికి లిడార్స్, రాడార్స్, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాం. కెమెరా ఆధారిత సాంకేతికత ద్వారా మా రోబో అన్ని పనులను పూర్తి చేసింది’ అని సూరజ్‌ చెప్పారు. ఈ విజయం ఎంతో గర్వకారణమని రోబోటిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధినేత ప్రొఫెసర్‌ మాధవ కృష్ణ చెప్పారు. రెండో స్థానంలో నిలిచిన ఈ టీమ్‌ రూ.2.5 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది.  

లూమోస్‌ టీమ్‌ ఇలా.. 
ఈ పోటీలో ఆదిత్య అగర్వాల్, బిపాషాసేన్, విశాల్‌రెడ్డి మందడి, శంకర నారాయణన్‌తో కూడిన లూమోస్‌ జట్టు మూడవ స్థానంలో నిలిచి రూ.77వేలు గెలుచుకుంది. టీసీఎస్‌ రీసెర్చ్‌ ఇండియా సహకారంతో ప్రొఫెసర్‌ కృష్ణ మార్గనిర్దేశనంతో పోటీపడింది. ‘రోబోటిక్‌ పరిశోధనలో రోబో గ్రాస్పింగ్, మానిప్యులేషన్‌ ముఖ్యం. కేవలం వస్తువులను తీయడం, పట్టుకోవడంతోపాటు విసరడం, నొక్కడం, స్లైడింగ్‌ చేయడం, పేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి అనేక పనులు చేయడానికి మనుషుల చేతుల మాదిరి నైపుణ్యం కలిగిన చేతులను  రూపొందించడానికి అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో మాదైన శైలిలో ప్రదర్శన చేసి మేము విజయం సాధించాం’ అని టీమ్‌ సభ్యులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement