
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుజురాబాద్ మున్సిపాలిటీకి బుధవారం రూ.35 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలుస్తోంది.
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల ఈటల తీరుపై మండిపడ్డారు. ఈటల అసమర్థతతోనే హుజురాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. యుద్ధంలో వెనుతిరిగిన, పారిపోయిన సైనికుడు ఈటల అని అభివర్ణించారు. అధికారంలో ఉండి హుజురాబాద్ అభివృద్ధి చేయకపోవడం సిగ్గుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక హుజూరాబాద్ అభివృద్ధి తాను చూసుకుంటానని తక్షణమే రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్‌ను అభివృద్ధి చేస్తానని, వారం రోజులు అభివృద్ధి పనులు చేపట్టి పరిగెత్తిస్తానని తెలిపారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీలోకి వెళ్లి ఢిల్లీలో చెట్టుకింద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు.
త్వరలోనే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుండడంతో అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్ అన్ని చర్యలు తీసుకుంటోందని కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి వరుసగా గెలుపొందుతూ హుజురాబాద్‌లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న ఈటలను ఓడించేందుకు గులాబీ దళం ఇప్పటి నుంచే కార్యచరణ మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment