Regional Ring Road Hyderabad: Satellite-Based Survey For The Regional Ring Road In Telangana - Sakshi
Sakshi News home page

RRR Alignment: అంగుళం తేడా రాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ 

Published Fri, Jan 21 2022 4:01 AM | Last Updated on Fri, Jan 21 2022 12:25 PM

Satellite-Based Survey For The Regional Ring Road In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ ఆధారంగా నిర్మించాల్సిన రోడ్డుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో భూమి హద్దులను గుర్తించే సర్వే వేగంగా జరుగుతోంది. విదేశాల నుంచి సమకూర్చుకున్న పరికరాలు సహా దేశీయంగా తయారైన ఆధునిక డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం 12 బృందాలు క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నాయి. సంగారెడ్డి పట్టణం వద్ద మొదలైన సర్వే ప్రస్తుతం జగదేవ్‌పూర్‌ సమీపంలోని తుర్కపల్లి వరకు పూర్తయింది. అంగుళం కూడా తేడా రాకుండా, గూగుల్‌ మ్యాపు ఆధారంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్లాన్‌కు తగ్గట్టుగా అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూమిని గుర్తిస్తున్నారు.  

ప్రతి 5 కి.మీ.కు రెండు గుర్తింపు రాళ్లు 
ప్రస్తుత అలైన్‌మెంటు ప్రకారం రోడ్డు ఏయే సర్వే నంబర్ల మీదుగా నిర్మించాలో కచ్చితంగా గుర్తించే పని చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి సంబంధించిన గుర్తులేవీ పెట్టడం లేదు. రోడ్డును నిర్మించే గ్రామాలు, సర్వే నంబర్లకు సంబంధించి గెజిట్‌ విడుదలయ్యాకే ఆ పని జరగనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గం అక్షాంశ రేఖాంశాలను నిర్ణయిస్తున్నారు. ఇందుకు ప్రతి 5 కిలోమీటర్లకు రెండు గుర్తు రాళ్లను పాతి వాటి మీద డీజీపీఎస్‌ పరికరాలు ఉంచడం ద్వారా సూక్ష్మస్థాయి తేడా కూడా లేకుండా ఫీల్డ్‌ అలైన్‌మెంటును నిర్ధారిస్తున్నారు. అయితే ఈ గుర్తింపు రాళ్లను చూసి, అవే రోడ్డు హద్దు రాళ్లుగా భావిస్తున్న రైతులు, స్థానికులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ రాళ్లకు, ప్రతిపాదిత రోడ్డు హద్దులకు సంబంధం లేదని, అలైన్‌మెంటు ప్రకారం అస లైన హద్దులను గెజిట్‌ విడుదలయ్యాకే ఏర్పాటు చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. పూర్తిగా శాటిలైట్‌ సిగ్నల్స్‌ ఆధారంగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించే సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు, నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల పరిధిలోని 120 గ్రామాల మీదుగా ఈ సర్వే జరుగులోంది. ప్రస్తుతానికి 90 కి.మీ. మేర సర్వే పూర్తయింది.  

బహిరంగ విచారణ తర్వాతే.. 
ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించే గ్రామాలు, సర్వే నంబర్లతో కూడిన గెజిట్‌ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. ఇది పూర్తయిన తర్వాతనే ఆర్‌ఆర్‌ఆర్‌కు కావాల్సిన 100 మీటర్ల వెడల్పు భూమిపై హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ నెలన్నర నుంచి రెండు నెలల తర్వాతే మొదలు కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement