
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) రూట్లో మెట్రో ఏర్పాటుకు నిధుల లేమి శాపంగా పరిణమించనుంది. నిధుల సమీకరణ, ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) యంత్రాంగాన్ని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం శూన్యంగా మారనుంది.. ఈ రూట్లో మెట్రో ఏర్పాటుకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించి ఏడాది ముగిసినా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టి సుమారు రూ.4 వేల కోట్లు వ్యయం చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంలేదని సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్పీవీ సైతం నిధుల సమీకరణలో చేతులెత్తేయడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి తొలిదశ మెట్రో రైళ్లు కూడా డిపోలకే పరిమితమైన విషయం విదితమే. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ రైళ్లను నడుపుతామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా.. అనుమతులు లభించకపోవడం గమనార్హం.
ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఎప్పుడో?
రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంంలో ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ కారిడార్ ప్రాంతాలకు విచ్చేసే దేశ, విదేశీ ప్రయాణికులు అరగంట వ్యవధిలోగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఈ మార్గాన్ని డిజైన్ చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు ఏడాది క్రితమే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ నిధుల సమీకరణ విషయంలో స్పెషల్ పర్పస్ వెహికిల్ యంత్రాంగం చేతులెత్తేయడం, పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో పనులు ఎప్పుడు మొదలయ్యే విషయం సస్పెన్స్‌గా మారింది.
రెండో దశపై నీలినీడలు..
బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డికాపూల్ (26 కి.మీ), నాగోల్– ఎల్బీనగర్ (5 కి.మీ) మార్గంలో రెండు మెట్రో కారిడార్లను అనుసంధానించేందుకు రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత తరుణంలో రెండో దశ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సొంతంగా నిధులు వ్యయం చేసే పరిస్థితిలో లేకపోవడం, పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండోదశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
వ్యయం ఘనం.. ఫలితం అంతంతే..
నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టును నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్– మియాపూర్ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికి 2010–14లో రూ.8683 కోట్లు, 2015–20లో రూ.13,236.. మొత్తంగా రూ.21,919 కోట్లు ఖర్చు చేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ఇటీవల వెల్లడించింది. ఇందులో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సింహభాగం నిధులను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించి ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసింది. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఈ ప్రాజెక్టు నగర రూపురేఖలను మార్చినప్పటికీ.. మెట్రో రైళ్లలో లాక్‌డౌన్‌కు ముందు కేవలం 4 నుంచి 4.5 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారని.. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆశించినంతంగా సత్ఫలితాన్నివ్వలేదని స్పష్టమవుతోందని పట్టణ ప్రణాళిక రంగ నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ పంజాతో ప్రజా రవాణాపై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు. ఈ ఛాయలు భవిష్యత్‌లోనూ కొనసాగనున్నాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment