శాంతి కల్యాణోత్సవంలో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి
శంషాబాద్ రూరల్: భక్త జన సందోహం, వేద మంత్రాల మధ్య శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య క్షేత్రాల్లోని పెరుమాళ్లకు శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులతో 108 పెరుమాళ్ల నామస్మరణం చేయించారు.
ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 కౌంటర్ల ద్వారా భక్తులకు అక్షింతలు, ప్రసాదా లు పంపిణీ చేశారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్‌రావు, జూపల్లి జగపతిరావు కుటుంబసభ్యులు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీగా సందర్శకులు
వారాంతం కావడంతో సమతామూర్తి దర్శనానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే సాయంత్రం శాంతి కల్యాణోత్సవం ఉండడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఇక స్ఫూర్తి కేంద్రం ప్రధాన ప్రాంగణంలోనికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. పశ్చిమ వైపు ఉన్న 9వ నంబరు గేటు నుంచి ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోపలికి వదిలారు. కాగా ప్రధాన ప్రాంగణం ఎదురుగా ఉన్న ఆవరణలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో అక్కడ సుమారు పది వేల మంది వరకు కూర్చుని స్క్రీన్‌లపై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కల్యాణోత్సవానికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment