పాఠశాల ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్‌మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు.
తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్‌మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్‌మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్‌మన్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి
సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడి భరోసానిచ్చారు.
ప్రిన్సిపాల్, వాచ్‌మన్‌పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు
కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం
తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు.
ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్‌తో పాటు వాచ్‌మన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment