సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment