హైదరాబాద్: ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్టును కూల్చివేయడంపై ఓ 8వ తరగతి విద్యార్థి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాత్రికి రాత్రే అనుమతి లేకుండా చెట్టును తొలగించి నామరూపాల్లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విచారణ చేసిన అధికారులు సంబంధికులపై భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో జరిగింది.
సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉందని ఒకరు దాదాపు 40 ఏళ్లకు పైగా వయసు ఉన్న భారీ వేపచెట్టును కొట్టేశారు. చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయడంతో సమీపంలో ఉండే ఓ 8వ తరగతి పిల్లోడు షాకయ్యాడు. తెల్లవారుజామున కలపను తరలించడం, చెట్టు ఆనవాళ్లు కనిపించకుండా తగులబెట్టడం వంటివి చేయడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
తాను పచ్చదన పరిరక్షకుడిగా చెప్పి తన ఇంటి సమీపంలో చెట్టును నరివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు. దీంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అనుమతి లేకుండా చెట్టు కొట్టివేశారని నిర్ధారించుకుని బాధ్యులైన వారికి రూ.62,075 భారీ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన బాలుడిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment