సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై జడ్జి జయకుమార్ కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో.. శ్రీనివాస్‌గౌడ్ సహా 10 మందిపై ఎఫ్‌ఆర్‌ఐ చేయాలని జడ్జి జయకుమార్ ఇంతకు ముందు ఆదేశించారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు పెట్టాలని గతంలో ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే ?
2018 ఎన్నికల్లో TRS పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ మహాబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక కోసం నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఈ డాక్యుమెంట్లను సాధారణ ప్రక్రియలో భాగంగా అప్‌లోడ్ చేశారు. అయితే అప్‌లోడ్ అయిన డాక్యుమెంట్‌లలో కొన్ని పొరపాట్లు ఉండడంతో శ్రీనివాసగౌడ్ తెర వెనక వ్యవహరం చేశారని, పాత డాక్యుమెంట్ డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారని కొందరు ఫిర్యాదు చేశారు.
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఏం చేసింది?
ఈ ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్ వాసి చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసు వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మహబూబ్‌నగర్ రెండో టౌన్ స్టేషన్‌లో శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 10 మంది అధికారులపై ఇటీవలే కేసు నమోదయింది.
తిరకాసు ఎక్కడంటే ?
ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మొత్తం పది మంది అధికారులను చేర్చారు. వీరిలో నాటి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ , నాటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ , ఆనాటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులున్నారు.
ఎన్నికల సంఘం ఏం చేసింది?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీసుకున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఎక్కడయితే తప్పు జరిగిందో, ఎవరయితే తప్పు చేశారో వారిని నిందితులుగా చూడాలి తప్ప.. ఆ సమయంలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిందితులుగా పేర్కొనడం సరికాదని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. వీరి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ జయకుమార్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు.. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment