సాక్షి, వెబ్ డెస్క్: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ అకస్మాత్తుగా పవర్ పోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపోయిందని అనుకుంటాము. అయితే, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు.. కరెంట్ బల్బ్‌లు మార్చటం, తెగిపోయిన ఫ్యూజ్ స్థానంలో మరోటి అమర్చటం వంటి రిపేర్లను సులభంగానే చేసుకోగలగుతాము. కానీ ఇంట్లోని స్విచ్‌బోర్డులో సమస్య ఉంటే మాత్రం రిపేర్ చేసే సాహసం చేయము. ఎందుకంటే స్విచ్ బోర్డుల్లో పలు రకాల ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి కనుక. పవర్ సర్యూట్లు ఎక్కడ అనుసంధానం కోల్పోయిందో గుర్తించలేము.
అయితే ఇటువంటి వాటిని సంబంధిత ఎలక్ట్రీషియన్స్ మాత్రమే బాగుచేయగలరు. స్విచ్ బోర్డులోని సర్క్యూట్స్ ఇంట్లోని వంట గది, బెడ్‌రూం, హాల్, బాత్ రూంలకు అనుసంధానమై ఉంటాయి. కరెంట్ వస్తూ, పోతూ ఉండటంతో తరచూ స్విచ్ బోర్డులో సమస్యలు ఏర్పాడతాయి. అయితే కొన్ని సార్లు స్విచ్ బోర్డులు షార్ట్ సర్క్యూట్స్ కారణంగా పేలిపోయి ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూశాం. అయితే మీ ఇంట్లోని స్విచ్ బోర్డుల పరిస్థితి ఎలా ఉందో? ఎప్పుడు అవి రిపేర్ దశకు చేరుకున్నాయో తెలుసుకుంటే చాలా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు.
స్విచ్ బోర్డులు రిపేర్‌కు వచ్చాయని తెలుసుకొనే కొన్ని సంకేతాలు మీ కోసం..
1. స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం..
ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుల వద్ద కాలిపోయిన వాసన రావటం మనం గమనిస్తాము. కానీ, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. అయితే కరెంట్ ఓవర్ లోడ్ వల్ల స్విచ్ బోర్డుల్లో ఉండే వైర్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జాగ్రత్తపడి ఎలక్ట్రిషియన్‌ను సంప్రదించి కొత్త వాటిని మార్చుకోవాలి.
2. కాలం చెల్లిన పాత స్విచ్ బోర్డులు..
ఇల్లు కట్టినప్పటి నుంచి కొంత మంది స్విచ్ బోర్డులను అసలు మార్చకుండా కాలం గడుపుతారు. అయితే సుమారు 20 ఏళ్లు దాటిన స్విచ్ బోర్డులను తప్పనిసరిగా మార్చుకోవాలి. మారుతున్న సాంకేతికతతో కొత్త ఎలక్ట్రికల్ బోర్డులను ఉపయోంగిచడంతో పలు విద్యుత్ సమస్యలను నిలువరించవచ్చు. పాత వాటిని మార్చటంతో నాణ్యమైన కరెంట్ సరాఫరా ఇళ్లలో పొందవచ్చు.
3. బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోవటం..
వైర్ల మధ్య చోటు చేసుకున్న లూజ్ కనెక‌్షన్ల కారణంగా తరచూ ఇంట్లోని బల్బులు మినుకు మినుకు మంటూ ఆగిపోతాయి. అంటే ఇళ్లలోకి వచ్చే విద్యుత్‌తో స్విచ్ బోర్డులపై అధికంగా లోడ్ పడుతోందని గమనించాలి. లేదంటే వాటికి ఆ కరెంట్‌ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గినట్టు గుర్తించాలి.
4. సర్క్యూట్స్ పాడవటంతో కరెంట్ ట్రిప్ కావటం..
విద్యుత్ అధిక లోడ్, ఆకస్మికంగా కరెంట్ రావటం, పోవటం కారణంగా స్విచ్ బోర్డులోని పవర్ సర్కూట్లు పాడవుతాయి. పాడైన స్విచ్ బోర్డుల్లో ఉండే విద్యుత్ సర్క్యూట్స్ కారణంగా కరెంట్ తరచూ ట్రిప్ అవుతూ ఉంటుంది. పలు చిన్న, చిన్న సర్క్యూట్స్ తో అనుసంధానమయ్యే స్విచ్ బోర్డులు కరెంట్ లోడ్‌ను తట్టుకోవటం లేదని గుర్తించాలి.
5. తరచూ ఫ్యూజ్‌లు మండిపోవటం..
కరెంట్ సరాఫరా మార్పుల్లో భాగంగా తరచూ స్విచ్ బోర్డులో ఉండే ఫ్యూజ్‌లు మండిపోతాయి. స్విచ్ బోర్డులు కరెంట్‌ను కంట్రోల్ చేయకపోతే కూడా తరచూ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయి ఫ్యూజ్ మండిపోయే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే స్విచ్ బోర్డులను పనితీరు, వాటి స్థితిని గుర్తించగలిగితే ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment