
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఓల్డ్‌సిటీలో నాలాల పరిస్థితిపై శ్రద్ధ చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, నాలాల పనితీరుపై కేటీఆర్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ నాలాలను ప్రతిరోజూ మ్యాన్‌పవర్‌తో శుభ్రం చేయిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాకాల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించామని తెలిపారు. నాలాలు శుభ్రపరిచేందుకు యంత్రాల కొనుగోలు యోచనలో ఉన్నామని, నాళాలపై ప్రతిరోజూ అధికారులు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలో నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు నిర్మించామని మంత్రి వెల్లడించారు. నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలోనే తొలగిస్తామన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.