సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహిస్తోంది. బుధవారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ, అడిషనల్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ నిర్వహణ, లా అండ్ ఆర్డర్‌పై శిక్షణ ఇవ్వనున్నారు.
ఇక ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రెండుసార్లు ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
బోగస్ ఓట్ల తొలగింపు ఇలా..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను తొలగించినట్లు సీఈవో వికాజ్‌రాజ్ తాజాగా వెల్లడించారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఒకే వ్యక్తికి రెండు.. అంతకు మించి ఓట్లు ఉండడం, డూప్లికేట్ ఎంట్రీలు, వ్యక్తులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతల ద్వారా నివేదించబడిన నమోదులు తదితర కారణాలతో బోగస్ ఓట్లు తొలగించినట్లు తెలిపారు. అలాగే ఫాం-8 ద్వారా చిరునామా మార్చుకున్నప్పుడు పాత చిరునామాలో ఉన్న పేర్లను తొలగింపు ఉంటుందన్నారు. అలాగే ఓటరు సదరు చిరునామాలో నివసించనట్లు తెలిస్తే ఓటు డిలీట్ అవుతుందన్నారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలు పాటించామని సీఈవో తెలిపారు.
సీరియస్‌గా ఉండండి
రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు మార్గాలు అన్వేషించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈఓ కార్యాలయం, ఈసీ ద్వారా అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాస్తవ నివేదికలను ఆలస్యం చేయకుండా సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment