సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల్లేక యువతీయవకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ.. నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల’సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం పార్టీ కార్యాల యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం తొలి సంతకం చేసి ఈ కార్యక్రమానికి సంజయ్ శ్రీకారం చుట్టారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీ లేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014లో అసెంబ్లీలో కేసీఆర్.. 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ‘ఏడున్నరేళ్ల నుంచి ఒక్క గ్రూప్–1 ఉద్యోగం లేదు.. మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు’అని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘నిన్నొకాయన లక్షన్నర ఉద్యోగాలిచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెబుతుండు.. దమ్ముంటే ఆ జాబితాను విడుదల చేయాలి’అని సంజయ్ సవాల్ విసి రారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment