అమిత్‌షాతో జరిగిన సమావేశంలో బండి సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నందున టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎంపీ సోయం బాపూరావు తదితరులతో కలిసి మంగళవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి వివరించారు.
ఈనెల 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించిన అమిత్ షా.. పాదయాత్ర షెడ్యూల్‌ను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గంలో ముగింపు సభ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సంజయ్ చెప్పడంతో ఆరోజు తప్పకుండా తెలంగాణకు వస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం, అధికార టీఆర్‌ఎస్ వైఫల్యాలను వేర్వేరు రూపాల్లో ఎండగడుతూ మరింత దూకుడుగా పోరాటాన్ని నిర్వహించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని తప్పనిసరిగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరోౖ వెపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా రాష్ట్రానికి రావాల్సిందిగా సంజయ్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment