అమిత్‌షాకు స్వాగతం పలుకుతున్న సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలంతా అభిప్రాయభేదాలను వీడి, కలసికట్టుగా ముందుకు సాగాల్సిందేనని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బీజేపీకి ఎంతో కీలకంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సంస్థాగతంగా పూర్తి స్థాయిలో పటిష్టం కావాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి కార్యకర్తల అండ, ప్రజామద్దతు కూడగట్టేలా కృషి చేయాలని సూచించారు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షాకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ రాష్ట్రనేతలు స్వాగతం పలికారు. తర్వాత నోవాటెల్ హోటల్‌లో అమిత్‌షాతో రాష్ట్ర పార్టీ మినీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ భేటీలో ఖమ్మం, నాందేడ్‌లలో బీఆర్‌ఎస్ సభలు, కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్ సభ తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నందున.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అమిత్‌షా సూచించినట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో, బయటా బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment