
దుబ్బాకలో జరిగిన సంకల్ప యాత్రలో ప్రవీణ్
ఆర్మూర్/దుబ్బాకటౌన్: అమ్ముడుపోని సమాజాన్ని స్థాపించినపుడే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజి గౌతమ్, రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకు బీఎస్పీ సిద్ధాంతాలు, జెండాను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మినీ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘బీసీలకు రాజ్యాధికార సంకల్పసభ’లో వారు మాట్లాడారు. బీసీలు వెనకబడ్డ తరగతుల వారు కాదని, వెనక్కి నెట్టివేయబడిన తరగతుల వారని ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంతకుముందు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్‌యాత్ర ముగింపు సభ సిద్ది పేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బహుజన రాజ్యమేనన్నారు. బహుజన రాజ్యస్థాపనకు 26 రోజులుగా 235 గ్రామాల్లో పర్యటించానన్నారు. స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ తప్ప మిగతావన్నీ ఆధిపత్య కులాలకు పెంపుడు కుక్కల్లా మారాయన్నారు.