
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్‌ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది.
పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్‌ఎస్‌పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment