
గజ్వేల్: తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై మరింత ఫోకస్ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డిలతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, మర్కూక్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల సమగ్రాభివృద్ధిపై చర్చించారు.
నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పనులను పూర్తి చేయగలిగామని, పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలో ఇళ్లు లేనివారికి ఇళ్ల కేటాయింపు, మండల కేంద్రాల్లో కొత్తగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర పనులను వెంటనే పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా గజ్వేల్ పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అధికారులు బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఏయే పనులు చేపట్టాలనే అంశంపై ప్రతిపాదనలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం.