సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెల 6న హాజరుకానున్న వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభతో రాష్ట్రంలో రాజకీయ అంచనాల్లో మార్పు రావాలనే లక్ష్యంతో భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పార్టీ సత్తా చాటేందుకు టీపీసీసీ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేయాలని, వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో జరగనున్న సభకు ఐదు లక్షలకు తగ్గకుండా సమీకరించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర పార్టీ కీలక నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సమీక్షలు
రాహుల్ సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలనే వ్యూహంతో ఉన్న పార్టీ ఇందుకోసం క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మంగళవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లా నేతలతో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జనసమీకరణకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెడుతున్నారని సమాచారం. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు.
ఈనెల 22న మధుయాష్కీతో కలిసి వీరు వరంగల్ వెళ్లనున్నారు. అక్కడ ఆర్ట్స్ కళాశాలలో రాహుల్ సభాస్థలి పరిశీలన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. అంతకుముందు రోజు రేవంత్ ఖమ్మం వెళ్లి పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈనెల 23న గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతోపాటు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ భేటీలో రాహుల్ సభ పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారవుతుందని తెలిసింది. మొత్తం మీద రాహుల్ రాకతో రాష్ట్రంలో సీన్ మారాల్సిందేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో ఈ సభతో నిరూపిస్తామని పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment