హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధ దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన విద్యుత్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గురువారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధ, సివిల్ సప్లయిస్ భవన్ ముట్టడికి టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,పాటు వీహెచ్, దాసోజు శ్రావణ్, షబ్బీర్ అలీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి తదితరుల హౌస్ అరెస్టుతో వాతావరణం వేడెక్కింది.
తర్వాత శాంతియుత ఆందోళనలకు అనుమతినివ్వడం, నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా విద్యుత్ సౌధకు బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకోవడం, వారు బారి కేడ్లు దూకి చొచ్చుకురావడంతో విద్యుత్ సౌధ ముందు కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
బారికేడ్లు ఎక్కి... తలపాగా చుట్టి..
ఖైరతాబాద్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తలపాగా చుట్టిన రేవంత్.. యూత్ కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్‌తో కలిసి బారికేడ్లపై నిల్చుని కార్యకర్తలందరూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దీంతో నినాదాలు చేస్తూ ఫ్లైఓవర్ మీదుగా విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు.
విద్యుత్ సౌధ వద్ద బైఠాయింపు
విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు మళ్లీ యత్నించారు. దీంతో నేతలందరూ రోడ్డుపై బైఠాయించారు. అప్పుడు కూడా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో పలువురు మహిళా నాయకురాళ్లు కూడా విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా తోపులాటలో మహిళా నేత విద్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. తీవ్ర వాగ్వాదం అనంతరం 10 మంది నేతలను విద్యుత్ సౌధలోకి అనుమతించారు. దీంతో రేవంత్, భట్టి తదితర నేతలు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరారు.
కోర్టును ఆశ్రయిస్తాం: రేవంత్
తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.10 వేల కోట్లకు పైగా బకాయి పడిన రాష్ట్ర ప్రభుత్వం..ఆ బకాయి లు చెల్లించకుండా పేదలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలపై కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయనిపుణులతో చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని మీడియాకు చెప్పారు.
కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, అంజన్‌కుమార్ యాద వ్, అన్వేష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, మెట్టు సాయికుమార్, మానవతారాయ్ ఆందోళనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment