సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోవర్టుల అంశం కుదిపేస్తోంది. ఇది సీనియర్లను కలవరపరుస్తుండగా, పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే టీఆర్‌ఎస్, బీజేపీలకు కోవర్టులుగా కొందరు నేతలు పనిచేస్తున్నారని, అందుకే పనిగట్టుకుని అసమ్మతివాదం వినిపిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతోంది.
సీనియర్ నాయకుల పేర్లు పెట్టి మరీ కోవర్టుల ముద్ర వేసే ప్రయత్నాలు గతంలో జరిగినా ఏఐసీసీ కానీ, పీసీసీ కానీ ఖండించకపోవడం గమనార్హం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయనతో కూడా కోవర్టులకు వార్నింగ్‌లు ఇప్పించడం, ఆ తర్వాత అదే ప్రచారం పదేపదే జరుగుతుండటం, తాజాగా దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో కోవర్టుల అంశం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఎన్నిసార్లు అడిగినా...!
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులనే పదం తరచుగా వినిపిస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై ఎవరు నోరువిప్పినా వారు కోవర్టులని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. కొన్ని సందర్భాల్లో టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ... ఇలా చాలామంది నేతలు ఇతర పార్టీలకు కోవర్టులుగా మారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారం జరిగినప్పుడల్లా పార్టీ పక్షాన ఖండించాలని సదరు నేతలు కోరినా అటు ఏఐసీసీగానీ, ఇటు టీపీసీసీగానీ పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో, వేదికల్లో ఇలా ప్రచారం చేస్తోంది రేవంత్‌రెడ్డేననే చర్చ కూడా జరిగింది. అయితే, రేవంత్‌రెడ్డి మాత్రం ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదని కొట్టిపారేశారే తప్ప పార్టీలో కోవర్టులులేరని ఖండించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
కనుగోలు కార్యాలయంలో కుట్ర జరిగిందా?
తాజాగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి సందర్భంగా కోవర్టుల వ్యవహారానికి సంబంధించిన పలు విషయాలు, విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు కూడా వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టేలా ఈ కార్యాలయం పనిచేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం బహిరంగంగానే వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేసే విధంగా తలలు మార్చి మార్ఫింగ్ చేసిన ఫొటోలు సునీల్ కనుగోలు కార్యాలయంలో దొరికాయని తనకు పోలీస్ కమిషనరే చెప్పినట్టు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించడం తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం కలిగిస్తోంది. అయితే సొంత పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం సునీల్ కనుగోలుకు ఏముందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సునీల్ కార్యాలయంపై దాడి అనగానే రేవంత్ రెడ్డి వర్గ నేతలు హడావుడి చేశారని, ఈ నిజాలు బయటకు వస్తాయనే నానా హంగామా చేసి ఏ అంశంపై స్పందించని విధంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు ఇదే కారణమనే చర్చ జరుగుతోంది.
పార్టీ నుంచి కాంగ్రెస్ వాదులను వెళ్లగొట్టే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే మీడియా ముందుకు రావాలని సీనియర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికితోడు కీలక నాయకులు సిఫారసు చేసిన జిల్లా అధ్యక్షులను ప్రకటించకుండా నిలిపివేయడం, పీసీసీ డెలిగేట్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకంలో పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారికే పదవులు ఇప్పించడంతో ఈ నేతల్లో అసమ్మతి పెల్లుబికింది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ కాంగ్రెస్ తమ చేతి నుంచి వెళ్లిపోతుందనే ఆందోళనతోనే తాజా కార్యాచరణకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పూనుకున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment