
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రులు దామోదర, ఉత్తమ్ తదితరులు
రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కసరత్తు చేస్తున్నాం
శంషాబాద్ విమానాశ్రయం వద్ద వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్
దేశంలో 40 శాతం మందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు: నాగేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ కార్డు అందించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సన్మాన కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 1,000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రపంచంలో ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్‌లో చికిత్స లభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘ప్రపంచ దేశాల కు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని భావిస్తున్నాం. పౌరులు వైద్యుల దగ్గరకు వెళ్లిన ప్రతిసారి వైద్య పరీక్షలు రాస్తున్నారు. దీనికి సంబంధించిన డేటా ఎక్కడా ఉండటంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రైవ సీతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డును తయారు చేయాలను కుంటున్నాం. ఫలితంగా వ్యక్తి ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో వైద్యులకు ఇదొక పెద్ద ఆస్తిలా ఉపయోగపడుతుంది.
గతంలో ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్య సేవల కోసం విదేశాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వచ్చేవారి కోసం ఆయా దేశాల నుంచి విమాన సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రిని కోరాం. దేశంలో మొదటిసారి ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుడిలా మనలో ధైర్యాన్ని నింపి చికిత్స అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానం మళ్లీ రావాలని కోరుకుంటున్నా’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు.
అంతకుముందు మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో వైద్య రంగంలో భారతరత్న ఇస్తే.. అది నాగేశ్వర్‌రెడ్డికే ఇవ్వాలన్నా రు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర విభాగాలకు ఉన్నంత గుర్తింపు గ్యాస్ట్రో ఎంటరాలజీకి లేదని అన్నారు. దేశంలో సుమారు 40% ప్రజలు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మెడిసిటీ ఆసుపత్రి వ్యవస్థాపకుడు పీఎస్ రెడ్డి, ఎమ్మె ల్యేలు వివేక్, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment