సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి ఎన్నికల లొల్లి మొదలైంది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) పాలకమండలికి సంబంధించిన ఎన్నికల వ్యవహారం అధికారులకు తలనొప్పిలా తయారైంది. టీఎస్‌ఆర్టీసీ సీసీఎస్ టర్నోవర్ రూ.1500 కోట్లు. ప్రతినెలా దాదాపు రూ.25 కోట్లు ఇందులో జమచేస్తారు. ఆ మొత్తం నుంచి రుణాలను అందిస్తారు. ఈ నిర్వహణకోసం పాలకమండలి ఉంటుంది. సీసీఎస్‌కు 282 మంది ప్రతినిధులను వారి నుంచి పది మందితో మేనేజ్‌మెంట్ కమిటీని ఎంపిక చేస్తారు.
ఇది ఐదేళ్లపాటు కొనసాగుతుంది. నవంబరుతో ఆ ఐదేళ్ల కాలం పూర్తయింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరిపాల్సి ఉంది. ఇప్పుడు అక్కడే వివాదం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కార్మిక సంఘాల పేరుతో జరగనప్పటికీ, ఎన్నికలు ఆసాంతం కార్మిక సంఘాల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆర్టీసీ సమ్మె తరువాత 2019 నుంచి కార్మిక సంఘాల ఊసే లేదు. డిపో స్థాయిలో స్థానిక సిబ్బందితో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూనియన్ పేరెత్తితేనే అధికారులు మండిపడుతున్నారు.
వాటితో సఖ్యతగా ఉంటే ముఖ్యమంత్రికి కోపమొస్తుందన్న భయంతోనూ ఉన్నారు. ఈ ఎన్నికలను నిర్వహిస్తే మళ్లీ కార్మిక సంఘాలకు ప్రాణం పోసినట్టవుతుందన్న ఉద్దేశంతో.. ఎన్నికలు లేకుండా చూడాలని అధికారులు యత్నిస్తున్నారు. కానీ సహకార చట్టం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే విషయమై రెండు రోజుల క్రితం రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వద్ద సీసీఎస్ అధికారులతో సమావేశం జరిగినట్టు తెలిసింది.
ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేసి, ప్రస్తుత పాలక మండలితోనే నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. సీసీఎస్‌తోపాటు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాలని పట్టుపడుతున్నాయి. మళ్లీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇది రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన అశ్వత్థామరెడ్డి తాజాగా ఆ సంఘం సమావేశానికి హాజరై ఇలాంటి ప్రకటనే చేయటం, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈనెలలోనే సీసీఎస్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో వివాదం మరింత ముదురుతోంది.
Comments
Please login to add a commentAdd a comment